హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకూ సందేహాస్పదంగా ఉన్న ఓటర్లు ఎంత మంది? సర్‌ తర్వాత హైదరాబాద్‌ ఓటింగ్‌ గణనీయంగా మెరుగుపడుతుందా?

Reported by: Jagan Mohan Talluri | విధాత ప్రత్యేకం | Edited by: విధాత ఎక్స్క్లూజివ్ డెస్క్ | Jul 16, 2026, 8:16 pm IST
Read Time: 11 mins
హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?

హైలైట్స్:

  • ఈసీ ఆగ్రహంతో తొలగింపు?.. అందుకే నెమ్మదించిన నమోదు
  • ఇప్పటి వరకు తెలంగాణలో 59 శాతం నమోదు
  • సర్–2026 తరువాత సిటీలో భారీగా పెరగనున్న పోలింగ్
  • 89 లక్షల ఓట్లు సందేహాస్పదం!

విధాత, హైదరాబాద్:

హైదరాబాద్ మహా నగరంలో జనాభా అధికంగా ఉండడం, అందుబాటులో ప్రభుత్వ సిబ్బంది లేకపోవడం ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కు ప్రధాన సమస్యగా పరిణమించిందని జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఇదే అదనుగా భావించిన హైదరాబాద్ అధికారులు ఎన్నికల కమిషన్ అంతగా పట్టించుకోదనే ఉద్దేశంతో అటెండర్ కన్నా కింది స్థాయి ఉద్యోగులను బూత్ లెవెల్ ఆఫీసర్ల (బీఎల్ఓ)ను 30 శాతం వరకు నియమించినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (టీజీ సీఈఓ) కార్యాలయానికి చేరడంతో ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారని సమాచారం. అత్యంత కీలకమైన విధుల్లో స్వీపర్లు, కామాఠీలను ఎలా నియమిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఉండడంతో నియమించినట్లు సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఎన్నికల విధులు అంటే తమాషాగా ఉందా? అంటూ మండిపడడంతో చేసేది లేక దిద్దుబాటు చర్యలు చేపట్టారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూనియర్ అసిస్టెంట్ స్థాయి కన్నా దిగువన ఉన్నవారిని బీఎల్ఓలుగా నియమించవద్దని హెచ్చరించినట్లు సమాచారం. వారి స్థానంలో (30 శాతం) కొత్తవారిని నియమించడం, వారు బాధ్యతలు స్వీకరించడం వంటి కారణాలతో హైదరాబాద్ నగరంలో సర్ – 2026 ( ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ) కార్యక్రమం మందకొడిగా జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వేగం అందుకోగా, బీఎల్ఓ లు ఇంటింటికి వెళ్లి ఫారాలను పంపిణీ చేస్తున్నారు.

89 లక్షల ఓట్లు సందేహాస్పందం!

హైదరాబాద్ తో పోల్చితే తెలంగాణ వ్యాప్తంగా సర్ తుది దశకు చేరుకుందని, పెంచిన గడువుతో ఇక్కడ కూడా పని పూర్తవుతుందని అంటున్నారు. అయితే మొత్తం ఓటర్లలో 89 లక్షల పేర్లు అనామలీస్ (సందేహాస్పదం) గా గుర్తించారు. పేర్ల అక్షరాల్లో దోషాలు, చిరునామా మార్పిడి, తండ్రి పేరు తప్పుగా ఉండడం, పొంతన లేకుండా వివరాలు ఉండడం వంటివి ప్రధాన కారణంగా ఉన్నాయి. ఆన్ లైన్ లో ఆధార్ తో లింకింగ్ చేయడం మూలంగా ఒక్క అక్షరం తేడా ఉన్నా సాఫ్ట్ వేర్ అంగీకరించడం లేదు. ఆఫ్ లైన్ (ఫారాల ద్వారా) లో మాత్రం ఎలాంటి దోషాలు ఉన్నా స్వీకరిస్తున్నారు. సరి చేసుకునేందుకు అవకాశం ఉండడం మూలంగా పలువురు బీఎల్ఓ లు అందచేసిన నమోదు ఫారాలను నింపి, పాస్ పోర్టు సైజు ఫోటో అతికించి అందచేస్తున్నారు. పరిశీలించిన తరువాత బీఎల్ఓ లు స్వీకరించినట్లు మరో ఫారం పై సంతకం చేసి ఓటర్లకు తిరిగి ఇస్తున్నారు.

వేర్వేరు రాష్ట్రాలవారు తెలంగాణలో

తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లే కాకుండా ఉత్తరప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్లు నివాసమంటున్నారు. వీరిలో వృత్తి నిపుణులతో పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, కూలీలు కూడా ఉన్నారు. సర్ – 2026 లో ఏదో ఒక ప్రాంతంలో మాత్రమే ఓటరుగా కొనసాగాల్సి ఉంటుంది. ఒకే ఓటరు రెండు ప్రాంతాలలో ఓటు హక్కు పొందే అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో పలువురు తమ స్వరాష్ట్రంలో ఓటు హక్కు కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ కు చెందిన వారు కూడా హైదరాబాద్ లో కాకుండా తమ స్వగ్రామంలోనే ఓటరుగా కొనసాగేందుకు ఫారాలు నింపి ఇస్తున్నారు. ఆంధ్రా ప్రాంతం వారు తమ స్వరాష్ట్రంతో పాటు తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీళ్లందరూ తెలంగాణ లేదా ఏపీని ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండు చోట్ల ఓటు హక్కు కొనసాగించడానికి వీలు లేకుండా పకడ్బందీగా సర్ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం 59 శాతం మంది నమోదు ఫారాలు అందచేశారు. హైదరాబాద్ లో వంద శాతం నమోదు ఫారాలను పంపిణీ చేశామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా చాలా మందికి తమకు అందలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆన్ లైన్ లో 7.8 శాతం నమోదు చేసుకోగా, అందిన వాటిలో 25.5 శాతం ఫారాలను డిజిటైజ్ చేశారు. మొత్తం ఓటర్లలో 25 శాతం వరకు చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, అందుబాటులో లేనివారు, అనర్హులు, రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వారు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మొత్తం ఓటర్లలో సర్ ప్రక్రియ తరువాత 80 శాతం వరకు అసలైన ఓటర్లు గా మిగలవచ్చని ఒక అంచనా. దీంతో ఓటర్ల జాబితా పూర్తి ప్రక్షాళన పూర్తవుతుందని, బోగస్ ఓట్లు అనే మాట వినబడదు అనే చర్చ జరుగుతోంది. అయితే అక్టోబర్ 12 తరువాత వెలువడే తుది ఓటరు జాబితాలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు అనేది పూర్తి స్పష్టత రానున్నది. దీంతో రానున్న హైదరాబాద్ నగర మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. అసలు సిసలు ఓటర్ల జాబితా మూలంగా ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుందని ఒక అధికారి తెలిపారు. గత లోకసభ ఎన్నికల్లో హైదరాబాద్ లో 45 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు అయ్యింది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే శాతం నమోదు కావడం విశేషం. తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో 64 శాతం గా నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.

సర్ తరువాత బెంగాల్, తమిళనాడులో పోలింగ్ మోత….

సర్ తరువాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం అమాంతంగా పెరిగింది. బెంగాల్ లో 92.7 శాతం, తమిళనాడు లో 85.14 శాతం నమోదు అయ్యింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటర్ల జాబితాను శుద్ధి చేసిన తరువాత ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయ్యిందని, తెలంగాణ లో కూడా రానున్న ఎన్నికల్లో గతం కన్నా చాలా ఎక్కువగా పోలింగ్ జరుగుతుందని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది చివరలో జరిగే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, ఆ తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా ఉంటుందనే చెప్పకనే చెబుతున్నారు.

Status Report on SIR in Telangana as on 16072026_ 6PM

Jagan Mohan Talluri
jaganmohan.talluri@gmail.com