Rythu Badi Agri Show | హైదరాబాద్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన రైతు బడి అగ్రిషో ఆదివారం విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ప్రదర్శనకు సుమారు లక్ష మంది రైతులు హాజరై, వ్యవసాయ రంగంపై తమ ఆసక్తిని చాటుకున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వారాంతం కావడంతో అగ్రి షోను సందర్శించేందుకు భారీ సంఖ్యలో రైతులు, సందర్శకులు తరలివచ్చారు. సాగు రంగంలో వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలు, యంత్రాలు, కొత్త పద్ధతులు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైతులతో పాటు వ్యవసాయ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా అధునాతన వ్యవసాయ పరికరాలపై విశేష ఆసక్తి చూపించారు. వాటి వినియోగ విధానం, ప్రయోజనాలు గురించి స్టాల్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మరుసటి సంవత్సరం ఫిబ్రవరి 3, 4, 5, 6 తేదీల్లో రామోజీ ఫిలిం సిటీ పరిసరాల్లో మరింత విస్తృత స్థాయిలో ఈ అగ్రి షోను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
