T20 CWC – Super 8: IND vs SA |పట్టుబిగించి వదిలేసిన భారత్​ – దక్షిణాఫ్రికా 187 పరుగుల భారీ స్కోరు

భారత్‌తో జరిగిన టి20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 187/7 స్కోరు చేసింది. మిల్లర్ అర్ధశతకం, బ్రెవిస్ దూకుడు, స్టబ్స్ చివరి ఓవర్ సిక్సర్లతో గట్టి స్కోరు నమోదు చేసింది.

దక్షిణాఫ్రికా బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్న దృశ్యం, మిల్లర్ హాఫ్ సెంచరీ, బుమ్రా వికెట్ సంబరం

Miller, Brevis Counter After Early Collapse; SA Set 188-Run Target for India

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

T20 CWC – Super 8: IND vs SA |అహ్మదాబాద్​ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్​ – దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న సూపర్​–8 మ్యాచ్​లో టాస్​ గెలిచి తొలుత బ్యాటింగ్​  చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. పవర్​ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా, బ్రెవిస్​ – మిల్లర్​లు భారీ భాగస్వామ్యంతో ఆదుకుని జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపారు.​

పవర్ప్లేలో భారత్ పట్టు

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాను పవర్‌ప్లేలోనే భారత్ భారీ దెబ్బ తీసింది. జస్ప్రీత్ బుమ్రా అద్భుత లైన్-లెంగ్త్‌తో టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అర్ష్‌దీప్ సింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బుమ్రాకు సహకారం అందించగా, తొలి ఆరు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా తీవ్ర ఒత్తిడిలో పడింది.

మిల్లర్–బ్రెవిస్ ఎదురుదాడి : భారీ భాగస్వామ్యం

అయితే అక్కడి నుంచే మ్యాచ్ మలుపు తిరిగింది. యువ ఆటగాడు డివాల్డ్ బ్రెవిస్ స్పిన్నర్లపై దూకుడుగా దాడి ప్రారంభించాడు. మరో ఎండ్‌లో అనుభవజ్ఞుడు డేవిడ్ మిల్లర్ సమయోచిత షాట్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం రన్‌రేట్‌ను వేగంగా పెంచింది. బ్రెవిస్ 45 పరుగులకు ఔటైనా, మిల్లర్ 63 పరుగులతో అర్ధశతకం పూర్తి చేసి జట్టును పటిష్టమైన స్థితికి చేర్చాడు. వీరిద్దరూ 4 వికెట్​కు 97 పరుగులు జత చేసారు. ఇదే దక్షిణాఫ్రికా భారీ స్కోరుకు పునాది వేసింది. 15వ ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి మిల్లర్‌ను ఔట్ చేయడంతో భారత్‌కు ఊరట లభించింది.

డెత్ ఓవర్లలో బుమ్రా క్లాస్… స్టబ్స్ దూకుడు

చివరి దశలో మళ్లీ బుమ్రా తన క్లాస్ చూపించి కీలక వికెట్లు సాధించాడు. బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు.కానీ, హార్థిక్​ పాండ్యా చివరి 20వ ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది, మొత్తంగా 20 పరుగులు పిండుకోవడంతో దక్షిణాఫ్రికా స్కోరు అమాంతం పెరిగింది. 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన స్టబ్స్ ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపు ఇచ్చాడు.

మొత్తంగా, పవర్‌ప్లే భారత్‌ వైపు నిలవగా, మధ్య ఓవర్లు దక్షిణాఫ్రికాకు, … చివర్లో బుమ్రా, స్టబ్స్ దూకుడు కలిసి 187 అనే పోరాడాల్సిన స్కోరుకు దారి తీశాయి.

Latest News