Celebrities | రీల్ లైఫ్‌లో జంటగా అలరించి, రియల్ లైఫ్‌లోనూ దాంపత్య బంధంతో ఒక్కటైన సెలబ్రిటీ కపుల్స్ ఎప్పుడూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. రీసెంట్‌గా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో… వీరి కన్నాముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ జంటలపై ఓ లుక్కేద్దాం.
నాగార్జున – అమల
‘ప్రేమ యుద్ధం’, ‘కిరాయి దాదా’, ‘శివ’, ‘నిర్ణయం’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన నాగార్జున ,అమల 1992లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆఫ్‌స్క్రీన్ ప్రేమగా మారి, మూడు దశాబ్దాలుగా ఆదర్శ దంపతులుగా కొనసాగుతున్నారు. వీరి కుమారుడు అఖిల్ అక్కినేని కూడా హీరోగా సినీ రంగంలో రాణిస్తున్నాడు.
మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వంశీ’ సినిమా సమయంలో హీరోయిన్ నమ్రత శిరోద్కర్ తో స్నేహం పెంచుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారి, కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. టాలీవుడ్‌లో అత్యంత పాపులర్ ఫ్యామిలీగా వీరు నిలిచారు.
నాగచైతన్య – శోభిత ధూళిపాళ
అక్కినేని నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ 2024లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి సినిమాలో నటించకపోయినా, సోషల్ మీడియాలో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అంతకుముందు నాగచైతన్య సమంత ను వివాహం చేసుకుని, తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి
‘మిస్టర్’, ‘అంతరిక్షం 9000 KMPH’ చిత్రాల్లో కలిసి నటించిన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి 2023లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, వీరి ప్రేమ కథ సక్సెస్ అయింది. తాజాగా వీరికి ఓ బాబు జన్మించి కుటుంబంలో ఆనందం నింపాడు.
కిరణ్ అబ్బవరం – రహస్య గోరఖ్
‘రాజావారు రాణిగారు’ ద్వారా హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం తన తొలి హీరోయిన్ రహస్య గోరఖ్ ను ప్రేమించి 2024లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు జన్మించి కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకూ…
ఇంకా దక్షిణాదిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న పలువురు స్టార్ జంటలు ఉన్నారు:
సూర్య – జ్యోతిక
అజిత్ కుమార్ – షాలిని
రాజశేఖర్ – జీవిత
ఆర్య – సాయేషా సైగల్
ఉపేంద్ర – ప్రియాంక ఉపేంద్ర
బాలీవుడ్‌లో కూడా ప్రేమ వివాహాలు చేసుకున్న ప్రముఖులు ఉన్నారు,,
అమితాబ్ బచ్చన్ – జయా బచ్చన్
అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్
సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్
రణబీర్ కపూర్ – ఆలియా భట్
రణవీర్ సింగ్ – దీపికా పడుకొనే
ప్రేమకు వెండితెరే వేదిక…
ఇలా సినిమా సెట్లలో మొదలైన పరిచయాలు జీవితాంతం బంధాలుగా మారిన అనేక ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాం. అభిమానులు తెరపై చూసిన జంటలు నిజ జీవితంలోనూ ఒక్కటవ్వడం వారిలో మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. కెరీర్ ఒత్తిడులు, పబ్లిక్ లైఫ్ సవాళ్లు ఉన్నప్పటికీ, పరస్పరం అర్థం చేసుకోవడం, నమ్మకం, మద్దతు ఉంటే ప్రేమ బంధం మరింత బలపడుతుందనే విషయాన్ని ఈ స్టార్ జంటలు నిరూపిస్తున్నాయి.
