- ఇండియా కూటమికి షాక్
- నాలుగు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్‌కర్ విజయం
Chandigarh | చండీగఢ్ : ఇండియా కూటమికి, బీజేపీకి మధ్య ప్రతిష్ఠాత్మకంగా సాగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. ఇండియా కూటమి తరఫున నిలబడిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్‌కర్ ఓడించారు. ఆయనకు 16 ఓట్లు రాగా, ఇండియా కూటమికి 12 ఓట్లు వచ్చాయి. నిజానికి చండీగఢ్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైనన్ని స్థానాలను ఇండియా కూటమి కలిగి ఉన్నది. దీనితో గెలుపు సునాయాసమేనని భావించారు.
కానీ.. ఓట్ల లెక్కింపులో ట్విస్ట్ చోటు చేసుకున్నది. ఎనిమిది ఓట్లను చెల్లనివిగా ప్రకటించడంతో బీజేపీ విజయం సాధించింది. అయితే ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని, తన చేతిలో బ్యాలెట్‌ను గుంజుకుపోయారని ఆప్ కౌన్సిలర్ ప్రెల్లతా ఆరోపించారు. ఫలితాలను సవాలు చేస్తూ తాను హైకోర్టుకు వెళతామని ఆమె చెప్పారు. ‘మేం హైకోర్టును ఆశ్రయిస్తాం. ఈ రోజు బీజేపీ మోసం చేసి గెలిచింది. నా చేతుల్లోంచి బ్యాలెట్‌ను లాక్కున్నారు. కిరణ్‌ఖేర్ ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అసలు ఎనిమిది ఓట్లు ఎలా చెల్లకుండా పోతాయి?’ అని అన్నారు.
ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీతో నేరుగా తలపడిన తొలి ఎన్నిక ఇది. ఆప్, కాంగ్రెస్ ఇక్కడ కలిసి పోటీ చేశాయి. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 35 మంది సభ్యులకుగాను ఆప్ 13 మంది సభ్యులను కలిగి ఉన్నది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌కు చెరొక ఏడు స్థానాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఇండియా కూటమికే విజయావకాశాలు ఉన్నాయి. కానీ.. ఎనిమిది ఓట్లు చెల్లనివిగా ప్రకటించడంతో కూటమికి దెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ ఫలితాల ప్రకటన అనంతరం ఇండియా కూటమి సభ్యులు ఆందోళనకు దిగి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.