Site icon vidhaatha

తన శైలిని మార్చుకుని సంకీర్ణాన్ని మోదీ నడిపించగలరా?

న్యూఢిల్లీ: ఒకవైపు ఓట్లు తగ్గిపోయాయి. గతంకంటే గణనీయంగా సీట్లు తగ్గిపోయాయి. కనీసం మెజార్టీ కూడా సొంతగా సాధించలేని పరిస్థితి. భాగస్వామ్యపక్షాలపైనే ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉన్న నేపథ్యం! కానీ.. ఫలితాలు వెలువడిన సాయత్రం మాట్లాడిన మోదీ.. వాస్తవాలను మరుగునపర్చి.. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘జనతా జనార్దన్‌’ తమకు అపూర్వరీతిలో మూడోసారి అవకాశం ఇచ్చారని గర్వంగా ప్రకటించుకున్నారు. దీన్ని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. నమత్రత, ఆత్మశోధన అనేవి మోదీ డీఎన్‌ఏలో లేవేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం కలిగి ఉన్నా.. దేశ ప్రజలు బీజేపీని, దాని హిందూత్వ వాదాన్ని సాధ్యమైనంత మేరకు తిరస్కరించారన్నది తిరుగులేని వాస్తవం. అయితే.. గత పదేళ్లు మోదీ మాటే వేదంగా నడిచింది. పేరుకు సంకీర్ణ ప్రభుత్వమే అయినా.. దానికి పేరుకు బీజేపీ నాయకత్వం వహించినా.. నిజానికి చెల్లుబాటైన మాట మాత్రం మోదీ, అమిత్‌షాలదేననడంలో సందేహం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు సీన్‌ మారిపోయింది. మోదీ మాటే వేదంగా నడిచే పరిస్థితి లేదు.

సంకీర్ణ భాగస్వామ్య పక్షాల్లో చంద్రబాబు నాయుడు, నితీశ్‌కుమార్‌ కింగ్‌మేకర్లుగా అవతరించారు. ఇప్పుడు ప్రభుత్వ మనుగడ నిస్సందేహంగా టీడీపీ, జేడీయూ నేతల చేతిల్లోనే ఉన్నది. అయితే.. ఇతర పార్టీలను చీల్చి, తమవైపు తిప్పుకొనే అప్రజాస్వామిక చర్యలకు బీజేపీ పాల్పడితే కథ వేరుగా ఉంటుందేమో కానీ ఇప్పటికైతే ఇదే వాస్తవం. చాలా మంది రాజకీయ విశ్లేషకులు అందుకు ఉన్న అవకాశాలను కొట్టిపారేయడం లేదు కూడా. దీన్ని పక్కన పెడితే.. ఈ పదేళ్లు నడిచిన తీరుగానే కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తామంటే మోదీ ప్రభుత్వానికే ఎసరు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మోదీ రాజకీయ జీవితంలో ఎదుర్కొంటున్న తొలి సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగాలంటే మోదీ ముందుగా నమ్రత, అణకువ వంటి తన డిక్షనరీలో లేని పదాలను నేర్చుకోవాల్సి ఉంటుందని, వాటిని పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

మోదీ ఇంత వరకూ ఏ ఎన్నికలోనూ ఓటమిపాలవలేదు. మోదీ గతం కంటే భారీ విజయాలను బీజేపీకి సాధించి పెట్టారు. దాంతో గత పదేళ్లలో పార్టీ శ్రేణులు, ఆయన భక్తుల దృష్టిలో అవతార పురుషుడుగా మారారు. మీడియా మద్దతు, తిరుగులేని డబ్బు శక్తితో పార్టీలో మరెవరూ ప్రశ్నించలేని స్థితిని పొందారు. అయితే.. 2024 ఎన్నికలు ఓట్లు రాబట్టగలిగే మోదీ చరిష్మాకు గండి కొట్టడమే కాదు.. తన భాగస్వామ్య పక్షాలతో అణకువతో ఎలా వ్యవహరించాలో కూడా గుణపాఠం చెప్పాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు, నితీశ్‌కుమార్‌, ఆఖరుకు ఏక్‌నాథ్‌ షిండే వంటివాళ్లతో వ్యవహరించే సమయంలో సమన్వయంతో నడవాల్సి ఉంటుందని చెబుతున్నారు. మోదీ వంటి వ్యక్తికి ఇది అంత సులభమైంది కాదని, తీవ్ర ఇబ్బందికరమైన అంశమేనని అంటున్నారు.

ఒక్కసారి 1999కి వెళితే.. ప్రధానిగా ఉన్న అటల్‌ బిహారి వాజ్‌పేయి లోక్‌సభలో ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అప్పటి ఎన్డీయే ప్రభుత్వం నుంచి జయలలిత వైదొలగడంతో అవిశ్వాస తీర్మానంలో పదవి కోల్పోయిన ఏకైక ప్రధానిగా వాజ్‌పేయి నిలిచారు. కానీ.. తదుపరి ఎన్నికల్లో విజయం సాధించిన వాజ్‌పేయి.. అదే చిరునవ్వులు చిందిస్తూ ప్రభుత్వాన్ని ఐదేళ్లూ నడిపించారు. ఆయనలో ఉన్న ఇచ్చిపుచ్చుకునే ధోరణి.. ఆయనను కాపాడిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

మన్మోహన్‌ సింగ్‌ కూడా రెండు యూపీఏ ప్రభుత్వాలను 2004 నుంచి 2014 వరకు నడిపారు. 2009లో మద్దతు ఉపసంహరించిన సీపీఎం మినహాయిస్తే.. అందరు భాగస్వామ్యపక్షాలను మేనేజ్‌ చేసుకోగలిగారు.
ప్రస్తుత ఫలితాల నేపథ్యంలో భాగస్వామ్యపక్షాలపై ప్రత్యేకించి ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ, బీహార్‌కు చెందిన జనతాదళ్‌ (యునైటెడ్‌)పై మోదీ అధికంగా ఆధారపడాల్సి వస్తున్నది. ఈ రెండు పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు, నితీశ్‌కుమార్‌ తమకంటూ కొన్ని రాజకీయ ఆకాంక్షలు కలిగి ఉన్నవారే. తాను బీజేపీకి మద్దతు ఇవ్వడంలో దృఢంగా ఉంటానని, అయితే రాబోయే ఎన్నికల్లో తన బద్ధ శత్రువైన జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించడంలో తనకూ పూర్తి సహకారం ఇవ్వాలని చంద్రబాబు కోరుతున్నారు. తాను బీజేపీ వెంటే ఉంటానని చంద్రబాబు చెబుతున్నా.. ఆయన సమస్యాత్మకమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఎన్డీయే నుంచి బయటకు రావడమే కాకుండా.. మోదీ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రతిపాదించిందని వారు గుర్తు చేస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి ఆయన పెడుతున్న డిమాండ్లపై కొంత సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక నితీశ్‌కుమార్‌ విషయానికి వస్తే.. చంద్రబాబుకంటే పెద్ద డేంజర్‌ ఆయనే. రాత్రికి రాత్రే శిబిరాలు మార్చేయడంలో ఆయన చరిత్ర దేశానికి తెలియనిది కాదు.

అందులోనూ రాష్ట్ర ప్రయోజనాలకంటే వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా ఎక్కువ ఆలోచించే రకమని చెబుతారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని నిర్మించి, అదే కూటమిని వదిలిపెట్టి మళ్లీ ఎన్డీఏ పంచన చేరారు నితీశ్‌. వాస్తవానికి పదే పదే కూటములు మార్చే నితీశ్‌ను ఈసారి బీహారీలు శిక్షిస్తారనే అభిప్రాయాలు బలంగానే వ్యక్తమయ్యాయి. కానీ.. బీజేపీ సంఖ్యలోనే జేడీయూ కూడా 12 సీట్లు గెలుచుకున్నది. ఇప్పుడు నితీశ్‌ మరోసారి అలగకుండా చూసుకోవాల్సిన అనివార్యత మోదీపై ఉన్నది. కానీ.. నితీశ్‌ను సంతృప్తిపర్చడం ఎవరికీ సాధ్యం కాదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. వాస్తవానికి కేంద్రంలో నితీశ్‌కు పెద్ద పెద్ద కలలే ఉన్నాయి. ఒకనాడు నితీశ్‌ ప్రధాని అభ్యర్థిగా కూడా ప్రచారంలో ఉన్నారు. మళ్లీ ఆయనలో ప్రధాని కావాలన్న కోరిక కలుగదన్న నమ్మకమేంటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అలాంటిదేమీ లేదని ఇప్పటికి భావించినా.. నితీశ్‌కుమార్‌ను నమ్మడం కష్టమేనని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతుంటాయి. ఈయనతో కూడా మోదీ చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు.

ఏ సమయంలోనైనా మోదీ విధానాలను ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు, ప్రత్యేకించి చంద్రబాబు, నితీశ్‌కుమార్‌ తిరస్కరించేందుకు అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రత్యేకించి మోదీ దుందుడుకు హిందూత్వ విధానాలను, మైనార్టీ వ్యతిరేకతను చంద్రబాబు, నితీశ్‌ సమర్థించే అవకాశాలు ఉండబోవని మాత్రం స్పష్టం చేస్తున్నారు. తన ఆనుయాయులైన గౌతం అదానీ వంటి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా యథేచ్ఛగా వ్యవహరించే వైఖరిని చంద్రబాబు, నితీశ్‌ ఎంత మేరకు అంగీకరిస్తారనేది అనుమానమేనని అంటున్నారు.
అందుకే ఇప్పుడు మోదీ తాను చెప్పింది చేసుకుపోవడం కంటే.. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొనబోతున్నది. అంతేకాదు.. వారి కోరికలను కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. అంటే.. మరింత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. బీజేపీ నాయకులు మోదీ ఏది చెప్పినా తలూపుతారేమో కానీ.. తాను ఆధారపడిన భాగస్వామ్య పక్షాలు కూడా అదే పద్ధతిలో ఉంటారని అనుకుంటే మొదటికే మోసానికి వస్తుంది. అందుకే ఇకపై ఆయన మోదీ కీ గ్యారెంటీ అని గానీ, మోదీ సర్కార్‌ అని చెప్పేందుకు గానీ అస్కారం లేదు. కచ్చితంగా ఎన్డీయే సర్కార్‌ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. అదంతా వాస్తవ రూపం దాల్చాలంటే మోదీ మరింత తెలివిగా వ్యవహరిస్తూ ఐదేళ్లూ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. అందుకు ఆయన కావాల్సింది అణకువ, సహనం. మరి ఆయన డిక్షనరీలో లేని ఈ పదాలను ఆయన నేర్చుకుంటారా? వేచి చూడాల్సిందే.

Exit mobile version