ఆరెస్సెస్‌, హిందూత్వ సంస్థలకు 40 సైనిక్‌ స్కూళ్లు

  • Publish Date - April 4, 2024 / 05:50 AM IST

న్యూఢిల్లీ : సైనిక్‌ స్కూళ్లు! పిల్లలను క్రమశిక్షణతో పెంచేందుకు, పూర్తిస్థాయి ప్రభుత్వ పర్యవేక్షణలో మెరికల్లాంటి యువతను నవ సమాజానికి అందించేందుకు ఉద్దేశించిన మహత్తర పాఠశాలలు! ఇక్కడ కులమతాలకు అతీతంగా, జాతి ప్రాంతాలతో నిమిత్తం లేకుండా విద్యార్థులు అకుంఠిత దేశభక్తితో విద్యాభ్యాసం చేస్తుంటారు! ఇక్కడ విద్వేషాలకు తావులేదు. వైషమ్యాలకు చోటు లేదు! ఇంతటి పరమ పవిత్రమైన సైనిక్‌ స్కూళ్లను సైతం కాషాయీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంకల్పించింది. కేంద్రం నుంచి నిధులు ఇస్తాం.. సైనిక్‌ స్కూళ్లు నడుపుకోండి అంటూ ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు తలుపులు తెరిచింది! దేశంలో ప్రతి రంగంలో లోపిస్తున్నదని చెబుతున్న లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ లేదా సమానావకాశాలను ఇక్కడా తోసిపుచ్చింది!

దాదాపు 40 సంస్థలకు సైనిక్‌ స్కూల్‌ అగ్రిమెంట్లు కేటాయిస్తే.. అందులో ఎక్కువ భాగం ఆరెస్సెస్‌, దాని అనుబంధ హిందూత్వ శక్తులు, బీజేపీ నేతలు, దాని భాగస్వామ్య పక్షాలవే కావడం ఆందోళన రేపుతున్నది. క్రిస్టియన్‌, ముస్లిం పాఠశాలలకు గానీ, ఇతర మతపరమైన మైనారిటీ సంస్థలకు గానీ ఒక్కటి కూడా ఇవ్వకపోడం ప్రశ్నలు రేపుతున్నది.

2022 నుంచి 2023 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 40 సైనిక్‌ స్కూళ్లను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్), హిందూత్వ సంస్థలు, బీజేపీ నాయకులు లేదా దాని భాగస్వామ్య పక్షాలకు చెందినవారికి అప్పగించిందని సమాచారం హక్కు చట్టం కింద సేకరించిన వివరాల ఆధారంగా తెలుస్తున్నది. ఈ వివరాలను ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ అనే సంస్థ విశ్లేషించింది. అదే సమయంలో దేశంలో క్రిస్టియన్‌, ముస్లిం, ఇతర మతపరమైన మైనార్టీ సంస్థలు నడుపుతున్న ప్రైవేటు స్కూళ్లకు మాత్రం ఈ సైనిక్‌ స్కూళ్ల నిర్వహణకు అవకాశం ఇవ్వకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది.

సైనిక్‌ స్కూళ్లను కేంద్రంలోని రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సైనిక్‌ స్కూల్స్‌ సొసైటీ నిర్వహిస్తుంటుంది. 2023-14లో పార్లమెంటరీ స్థాయీ సంఘం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమి, ఇండియన్‌ నావల్‌ అకాడమిలో రిజిస్టరయినవారిలో దాదాపు 20 శాతం మంది సైనిక్‌ స్కూళ్లలో చదివినవారే. 2022కు ముందు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 33 సైనిక్‌ స్కూళ్లను నిర్వహించేవి. అయితే.. 2021 అక్టోబర్‌లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైనిక్‌ సైనిక్‌ స్కూళ్ల సొసైటీలో భాగస్వాములయ్యేందుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించింది. కేంద్రం నుంచి పాక్షిక ఆర్థిక సహాయం ఇచ్చేలా వారే తమ సొంత బ్రాంచీలను నడుపుకొనేందుకు అవకాశం కల్పించింది.

జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించేందుకు కొత్తగా 100 సైనిక్‌ స్కూళ్లను నెలకొల్పుతున్నట్టు ప్రకటించింది. ఇలా సైనిక్‌ స్కూల్‌ కాంట్రాక్ట్‌ పొందినవారి జాబితాలను ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ విశ్లేషించి చూడగా.. 40 ప్రైవేటు స్కూళ్లు మే 05, 2022, డిసెంబర్‌ 27, 2022 మధ్య కనీసం 40 ప్రైవేటు స్కూళ్లు సైనిక్‌ స్కూల్‌ సొసైటీతో ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో 11 ప్రైవేటు స్కూళ్లు బీజేపీ నాయకులకు చెందినవి, వారి అధ్యక్షతన ఉన్న ట్రస్టులవి, లేదా బీజేపీ రాజకీయ భాగస్వామ్యపక్షాలకు చెందినవారివి ఉన్నాయి. ఎనిమిది స్కూళ్లు బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ నిర్వహణలోనివి. మరో ఆరు స్కూళ్లు హిందూత్వ సంస్థలు లేదా హిందూ మత సంస్థలకు చెందినవి ఉన్నాయని ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ పేర్కొన్నది.

సైనిక్‌ స్కూల్‌ అగ్రిమెంట్లు పొందినవాటిలో హిందూ జాతీయవాది రితంభరకు చెందిన బృందావనంలోని సంవిద్‌ గురుకుల బాలికల సైనిక్‌ స్కూల్‌, సోలన్‌లోని రాజ్‌లక్ష్మి సంవిద్‌ గురుకులం ఉన్నాయని ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ తెలిపింది. దేశంలోనే తొలి బాలికల మిలిటరీ స్కూలుగా అవి చెప్పుకొంటున్నాయి. దుర్గా వాహిని అనే హిందూత్వ సంస్థ వ్యవస్థాపకులు రితంభర. ఈ సంస్థ వీహెచ్‌పీ అనుబంధ మహిళా విభాగం. రామజన్మ భూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. జనవరి 2వ తేదీన ఈ స్కూలు ప్రారంభోత్సవంలో మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. రామజన్మ భూమి ఉద్యమానికి రితంభర ఎంతో చేశారని కొనియాడినట్టు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వార్త పేర్కొంటున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు చెందిన విద్యా విభాగం విద్యా భారతి అఖిల భారత శిక్షా సంస్థాన్‌కు ఏడు సైనిక్‌స్కూళ్లు అప్పగించారు. హిందూత్వకు కట్టుబడి, దేశభక్తితో కూడిన యువతరాన్ని నిర్మించాలని భావిస్తున్నట్టు విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌ వెబ్‌సైట్‌ పేర్కొంటున్నది. హిందూ అతివాద నేత బీఎస్‌ మూంజ్‌ 1937లో నాసిక్‌లో స్థాపించిన భోంస్లా మిలిటరీ స్కూల్‌ను ప్రస్తుతం సెంట్రల్‌ హిందూ మిలిటరీ ఎడ్యుకేషన్‌ సొసైటీ నడిపిస్తున్నది. సైనిక్‌ స్కూల్‌ను ఆపరేట్‌ చేసేందుకు దీనికి కూడా అనుమతి లభించిందని రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ తెలిపింది.

బాంబు పేలుళ్ల కేసులో భోంస్లా మిలిటరీ స్కూలుకు లింకు

2006 నాందేడ్‌ బాంబు పేలుళ్ల కేసులో, 2008 మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నవారు భోంస్లా మిలిటరీ స్కూల్‌లో శిక్షణ పొందినవారేనని మహారాష్ట్ర యాంటి టెర్రర్‌ స్క్వాడ్‌ ఆరోపించింది.

సైనిక్‌ స్కూల్‌ పాలసీని ఉపసంహరించాలంటున్న ప్రతిపక్షం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సైనిక్‌ స్కూల్‌ పాలసీని ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ‘చిన్న వయసులోనే వారిని పట్టుకోవాలనే ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది’ అని మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రకాశ్‌ మీనన్‌ను ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ ఉటంకించింది. ఇది సాయుధ దశలాలకు మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సంస్థలకు సైనిక్‌ స్కూళ్లను అప్పగించడం సాయుధ దళాల స్వభావం, నీతిని ప్రభావితం చేస్తాయని చెప్పారు. ఈ పాలసీని ఉపసంహరించాలని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ బుధవారం ఎక్స్‌లో డిమాండ్‌ చేశారు. దేశ భద్రత, విద్యా వ్యవస్థల విషయంలో రాజీపడటం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. ఇప్పటికే అగ్నివీర్‌ స్కీమ్‌తో సాయుధ బలగాల వృత్తి నైపుణ్యాలపై దాడి జరిగిందని గుర్తు చేశారు. మన సైనికులకు అందుతున్న గౌరవాన్ని ఇవి మంటగలుపుతాయని పేర్కొన్నారు.

Latest News