India Climate Change | వర్షాలు విస్తారంగా పడటం వేరు.. వర్షపాతం అధికంగా నమోదవడం వేరు! సరిగ్గా ఇప్పుడు భారతదేశం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. నిజానికి గత కొద్ది నెలలుగా భారీ వర్షాలు దేశంలో అనేక ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. హిమాలయాల్లో ఒక గ్రామాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాయి. పంజాబ్‌లో పంట పొలాలను నీట ముంచేశాయి. కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాలు అల్లకల్లోలంగా మారాయి. ఇంకా అనేక రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. కానీ.. ఇంతాచేసీ.. నమోదైన వర్షపాతం.. సాధారణానికంటే కేవలం 8 శాతం ఎక్కువ. వాతావరణ మార్పుల నేపథ్యంలో రుతుపవనాలు మేఘాలను వర్షింపజేస్తున్నాయి. అదే సమయంలో తీవ్ర స్థాయిలో కుంభవృష్టి అనేక ప్రాంతాల్లో సంభవిస్తున్నది. అక్కడితో ఆగడం లేదు.. సుదీర్ఘకాలం పొడివాతావరణం నెలకొంటున్నది. వాతావరణ సీజన్ అస్తవ్యస్తంగా మారుతున్నది.
నైరుతి రుతుపవన సీజన్.. యావత్ దేశ వర్షపాతంలో 80శాతాన్ని అందిస్తున్నది. జూన్ మాసం తొలి రోజుల్లో మొదలై.. సెప్టెంబర్ చివరి వరకూ కొనసాగుతూ ఉంటుంది. ఒకప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడేవి. చలికాలంలో చలిపెట్టేది. ఎండా కాలంలో ఎండలు కొట్టేవి. ఎండాకాలం తర్వాత తొలకరి చినుకులతో తడిసిన నేల నుంచి వచ్చే మధురమైన సువాసన ఎవ్వరూ మర్చిపోయి ఉండరు. ఒకప్పుడు మన హృదయాలను పులకరింపజేసిన వానలు.. ఇప్పుడు గుండెల్లో కలవరాన్ని రేపుతున్నాయి. ఉప్పొంగే వరదలు.. ఊళ్లకు ఊళ్లను ఊడ్చుకుపోతున్నాయి. శవాల కుప్పలను తేల్చుతున్నాయి. ములుగు జిల్లా మోరంచపల్లి ప్రత్యక్ష ఉదాహరణ. వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు ఇటువంటి పరిస్థితులను అనుభవించినవే. నిజానికి ఈ ఏడాది రుతుపవనాలు రికార్డు స్థాయిలో వారం ముందే కేరళ తీరాన్ని తాకడం ద్వారా పదహారేళ్ల రికార్డును తిరగరాశాయి. కానీ.. రుతుపవనాలు వచ్చాయేకానీ.. చుక్క వర్షం కురిసింది లేదు. కొంతకాలానికి మళ్లీ పుంజుకుని.. పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. హిమాలయ పర్వతాల్లోని ధారాళి అనే గ్రామం.. ఆగస్ట్ నెలలో మేఘ విస్ఫోటంతో మెరుపు వరదలు వచ్చి.. స్థానిక మార్కెట్ నాలుగు అంతస్తుల భవనం స్థాయిలో కూరుకుపోయింది. ఆ గ్రామం చాలా వరకూ కొట్టుకుపోయింది. పర్యావరణ మార్పులకు కరిగిపోతున్న హిమానీ నదాలు (melting glaciers), మేఘ విస్ఫోటాలు (cloudbursts) ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశ ధాన్యాగారంగా పిలిచే పంజాబ్‌లో పెద్ద ఎత్తున పంట పొలాలు మునిగిపోయాయి. మొత్తం 23 జిల్లాలూ వర్షాలకు ప్రభావితమయ్యాయి. ఇంతటి తీవ్రమైన వరద పంజాబ్‌ను చుట్టుముట్టడానికి సాధారణ రుతుపవనాల వాతావరణ వ్యవస్థ, అరేబియా సముద్రంలో ఏర్పడే వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్ అసాధారణంగా తారసపడటంమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రతిచర్యలు ఈ ఏడాది ఉత్తర భారతదేశంలో వర్షాలను పెంచాయి. అటు కోల్‌కతా వంటి భారీ నగరాలూ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే 332 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. సగం లండన్ నగరం ఏడాది పొడవున పొందే వర్షపాతానికి ఇది సమానం. ఈ పరిస్థితికి కారణం.. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి. (low-pressure system) దక్షిణాదిలో హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలను మినహాయిస్తే భారీగా వర్షం దెబ్బను ఎదుర్కొన్న సిటీలు లేవు.
ఎందుకీ తీవ్రత?
వాతావరణ ఎంత వేడెక్కితే ఆకాశంలో అంత తేమ నిండిపోతుంది. ఒక డిగ్రీ వేడి పెరిగితే ఏడు శాతం నీరు అదనంగా ఆవిరి అయిపోతుంటుంది. ఇలా పోగుపడిన ఆవిరే.. మనకు వర్షం రూపంలో పడుతుంది. అంటే మనం పెంచే కాలుష్యం ఎంత ఎక్కువ వేడిని పుట్టిస్తే.. అంత ఎక్కువ వర్షాలకు సిద్ధపడాలన్నమాట. అవే అప్పుడప్పుడు ఇలా కుంభవృష్టి, మేఘ విస్ఫోటం పేరిట భూమికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటాయి. భారత రుతుపవన సీజన్‌ను గమనిస్తే ఇదే ధోరణి కనిపిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో పర్యావరణ మార్పులను గమనిస్తే.. రుతుపవన వ్యవస్థలు పశ్చిమ దిశకు నెట్టివేస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొంటున్నారు. ఫలితంగానే వాయవ్య భారత దేశంలో వర్షాలు పెరిగి, సహజంగా తరచూ వర్షాలు పడే ఈశాన్య ప్రాంతంలో తగ్గుతున్నాయని చెబుతున్నారు. ఏతావాతా.. ఈ మితిమీరిన వర్షాలు.. రుతుపవనాలను మిత్రుడి కాకుండా.. శత్రువుగా తయారు చేస్తున్నాయన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేలుకొని, గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలను నియంత్రించకపోతే రానున్న రోజుల్లో మరింత తీవ్ర పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
IMD | వానకాలంలో ఐఎండీ జారీచేసే.. ఎల్లో, ఆరెంజ్, రెడ్ హెచ్చరికల గురించి తెలుసా?
ఉత్తరాఖండ్ మేఘ విస్ఫోటాలు: దేవభూమిపై ప్రకృతి ప్రకోపానికి కారణమేంటి?
Hyderabad Musi River Encroachments | మూసీ కోపం వెనుక.. లక్షన్నర క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం.. 36 వేల క్యూసెక్కులకే విధ్వంసం