తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడడం లేదు. రెండు రోజుల్లో అల్ప పీడనం ఏర్పడనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. వర్షాలు తగ్గుముఖం పట్టాయని తెలంగాణలో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన తాజా అలర్ట్ తో తెలంగాణలోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర పరిసరాల్లో తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమంగా గుజరాత్ వైపు కదులుతూ అక్టోబర్ 1 నాటికి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.
మంగళవారం నాడు అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 1 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు సోమవారం నాడు తెలంగాణలోని నాగర్ కర్నూల్, నల్గొండ, గద్వాల, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ,జగిత్యాల, మంచిర్యాల,పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాయంతం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి పూట మోస్తరు వర్షం కురవనుంది.