Laya | కూతురు ఎంట్రీపై లయ కీలక వ్యాఖ్యలు.. సరైన కథ వస్తే శ్లోకను హీరోయిన్‌గా పరిచయం చేస్తా

Laya | తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎంతో దగ్గరైన హీరోయిన్లలో లయ ఒకరు. ‘స్వయంవరం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి సినిమాతోనే అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Laya | తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎంతో దగ్గరైన హీరోయిన్లలో లయ ఒకరు. ‘స్వయంవరం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి సినిమాతోనే అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ప్రేమించు’, ‘మనసున్న మారాజు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘శివరామరాజు’ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే లయ పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడే కుటుంబంతో స్థిరపడిపోయిన ఆమె చాలా సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంది. అయితే పిల్లలు పెద్దవాళ్లు కావడంతో ఇటీవల భారత్‌కు తిరిగి వచ్చి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

సినీ ఆరంగేట్రంపై కామెంట్స్..

గత ఏడాది హీరో నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమాలో నటిస్తూ లయ మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో హీరోకు అక్కగా నటించి తన నటనతో మెప్పించింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇప్పుడామె తన హిట్ జోడీ అయిన నటుడు శివాజీతో కలిసి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా లయ తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే సందర్భంగా తన కూతురు శ్లోక సినీ అరంగేట్రంపై కూడా స్పందించింది.

హీరోయిన్‌గా ఎంట్రీ..

నాలాగే నా కూతురు శ్లోకకు కూడా నటనపై చాలా ఆసక్తి ఉంది. ఇప్పటికే ఆమె కళలపై మంచి పట్టు సాధిస్తోంది. గతంలో రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంథోని’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. సరైన కథ, మంచి అవకాశం వస్తే తప్పకుండా నా కూతురిని వెండితెరకు పరిచయం చేస్తాను. ప్రేక్షకులు ఆమెను ఎలా స్వీకరిస్తారో చూడాలి” అని లయ తెలిపారు.

ఇప్పటికే శ్లోకకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తల్లి లయతో కలిసి ఆమె చేసే డాన్స్ వీడియోలు, రీల్స్ తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా శ్లోకకు క్లాసికల్ డాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో సినీ అభిమానులు కూడా లయ కూతురు ఎప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరైన అవకాశం వస్తే త్వరలోనే శ్లోకను వెండితెరపై చూడొచ్చని లయ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Latest News