Sekhar Kammula | చిరంజీవి నా అభిమాన హీరో.. ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం, ఆమెని మిస్ అవుతున్నా..

Sekhar Kammula | సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు, హృదయాలను తాకే భావోద్వేగాలు, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే కథనాలతో దర్శకుడు శేఖర్ కమ్ముల తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఆయన ఇటీవల ‘కుబేర’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు.

  • By: Sandeep |    movies |    Published on : May 23, 2026 12:48 PM IST
Sekhar Kammula | చిరంజీవి నా అభిమాన హీరో.. ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం, ఆమెని మిస్ అవుతున్నా..

Sekhar Kammula | సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు, హృదయాలను తాకే భావోద్వేగాలు, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే కథనాలతో దర్శకుడు శేఖర్ కమ్ముల తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విభిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఆయన ఇటీవల ‘కుబేర’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, ఇష్టాలు, కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో తనకు అత్యంత ఇష్టమైన దర్శకుడు బాపు అని శేఖర్ కమ్ముల తెలిపారు. బాపు సినిమాలు తనపై చాలా ప్రభావం చూపాయని, ఆయన చిత్రాల్లో ఉండే భావోద్వేగాలు, పాత్రల రూపకల్పన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. అలాగే తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అని, అభిమాన నటి మహానటి సావిత్రి అని వెల్లడించారు.

ఆమె ప్ర‌తిభ‌పై ప్ర‌శంస‌లు..

సావిత్రి నటన గురించి మాట్లాడుతూ ఆమె ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు. భావాలను కళ్లతోనే వ్యక్తపరిచే అద్భుతమైన నటి ఆమె అని, అలాంటి సహజమైన నటనను ప్రస్తుత తరం ఎక్కువగా చూడలేకపోతోందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నటీమణులకు సరైన అవకాశాలు లభించడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని సందర్భాల్లో ఒకే నటికి వేర్వేరు డబ్బింగ్ వాయిస్‌లు వినిపించడం వల్ల పాత్రల సహజత్వం దెబ్బతింటుందని అన్నారు.

ఇక హీరోయిన్ అనుష్క గురించి మాట్లాడిన శేఖర్ కమ్ముల, ‘అరుంధతి’ సినిమాలో ఆమె నటన అద్భుతమని కొనియాడారు. ఆ పాత్రకు అనుష్క పూర్తిస్థాయిలో న్యాయం చేసిందని, నటన పరంగా ఆ పాత్ర ఆమెకు ఎంతో ప్రత్యేక గుర్తింపును తెచ్చిందని అన్నారు. సినిమాను విజయవంతం చేయడంలో ఇతర విభాగాల పాత్ర కూడా ఉన్నప్పటికీ, అనుష్క ఆ పాత్రకు సరైన ఎంపిక అని చెప్పారు.

పెద్ద‌లు కుదిర్చిన వివాహం..

వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తన వివాహం ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ అని వెల్లడించారు. మొదట తాను కంప్యూటర్ సైన్స్ చదివి గ్రాఫిక్స్ రంగంలో కెరీర్ కొనసాగిస్తానని తన భార్య భావించిందని, సినిమా పరిశ్రమలోకి వస్తానని ఆమె ఊహించలేదని చెప్పారు.

సినీ రంగం గురించి తెలిసి ఉంటే పెళ్లి చేసుకునేదాన్ని కాదని ఇప్పటికీ సరదాగా చెబుతుందని ఆయన నవ్వుతూ అన్నారు. సినిమా రంగం చాలా రిస్క్‌తో కూడుకున్నదని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని తన భార్య భావించేదని తెలిపారు.అయితే తాను తీసిన సినిమాల వల్ల ఎప్పుడూ కుటుంబం తలదించుకోవాల్సిన పరిస్థితి రాలేదని, అందుకే ఇప్పుడు తన భార్య సంతోషంగా ఉందని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.

ఇక తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఇంట్లో అందరూ విమర్శనాత్మక దృక్పథంతో ఉంటారని చెప్పారు. ఏదైనా తప్పుగా అనిపిస్తే నేరుగా చెబుతారని, తమది సంప్రదాయ విలువలతో పాటు ప్రగతిశీల ఆలోచనలు ఉన్న కుటుంబమని వివరించారు. తన కుటుంబంలో చాలా మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారని, తన సోదరీమణులు వైద్య రంగంలో ఉన్నారని వెల్లడించారు. సినిమాల ద్వారా ప్రేక్షకులకు మంచి కథలు అందించడమే తన లక్ష్యమని, అదే తనకు సంతృప్తిని ఇస్తుందని శేఖర్ కమ్ముల తెలిపారు.