BharatiRaja | దక్షిణ భారత సినీ పరిశ్రమలో లెజెండరీ దర్శకుడిగా గుర్తింపు పొందిన భారతీరాజా బుధవారం కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో తమిళంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగభరిత కథలను అద్భుతంగా తెరకెక్కించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు భారతీరాజా.

తమిళ చిత్రసీమలో ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన ఆయన, తెలుగులోనూ కొన్ని గుర్తుండిపోయే సినిమాలను తెరకెక్కించారు. ముఖ్యంగా సీతాకోక చిలుక చిత్రం ఆయనకు తెలుగులో విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. యువతను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రంలో ముచ్చెర్ల అరుణ, కార్తిక్, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమా ప్రముఖ హాస్యనటుడు అలీ సినీ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది.

‘సీతాకోక చిలుక’ సెట్స్‌లో జరిగిన సంఘటన

భారతీరాజా మరణం నేపథ్యంలో ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పలువురు సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అలీ గతంలో చెప్పిన ఓ సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీతాకోక చిలుక షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో ఒకరు జోక్ వేయడంతో యూనిట్ సభ్యులంతా నవ్వారని, అయితే చాలా క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చే భారతీరాజా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారని అలీ వెల్లడించారు. అందరినీ వరుసగా నిలబెట్టి చెంపదెబ్బలు కొట్టారట. చిన్న పిల్లవాడినైన తనను కూడా విడిచిపెట్టకుండా రెండు చెంపదెబ్బలు కొట్టారని అలీ సరదాగా గుర్తు చేసుకున్నారు.

ఆ తర్వాత తాను ఏడుస్తూ ఉండగా నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గమనించి ఏమైందని అడిగారట. దర్శకుడు కొట్టారని చెప్పడంతో ఆయన జేబులో నుంచి రూ.200 తీసి ఇచ్చారని అలీ చెప్పారు. “అందరికీ ఒక్క దెబ్బ పడితే, నాకు మాత్రం రెండు దెబ్బలు పడ్డాయి. కానీ రూ.200 రావడంతో రోజూ ఇలా కొడితే రోజూ డబ్బులు వస్తాయేమో అనుకున్నా” అంటూ అలీ చెప్పిన వ్యాఖ్యలు అప్పట్లో నవ్వులు పూయించాయి.

తెలుగులోనూ ముద్ర వేసిన భారతీరాజా

సీతాకోక చిలుకతో పాటు భారతీరాజా తెలుగులో పలు చిత్రాలను తెరకెక్కించారు. చిరంజీవి హీరోగా వచ్చిన ఆరాధన చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సుహాసిని హీరోయిన్‌గా నటించారు. అలాగే కృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జమదగ్ని చిత్రాన్ని కూడా భారతీరాజానే రూపొందించారు. అదనంగా ‘కొత్త జీవితాలు’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు.

చిరంజీవిపై ప్రత్యేక అభిమానం

భారతీరాజాకు మెగాస్టార్ చిరంజీవిపై ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఓ సినీ వేడుకలో చిరంజీవిని ఆప్యాయంగా ముద్దుపెట్టి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. “ఆరాధన సినిమా సమయంలో ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారు” అంటూ చిరంజీవిని ప్రశంసించిన భారతీరాజా మాటలు అప్పట్లో అభిమానులను ఆకట్టుకున్నాయి.

భారతీరాజా మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. ఆయన తెరకెక్కించిన చిత్రాలు, ఆయన చూపించిన గ్రామీణ జీవితపు అందాలు, భావోద్వేగాల కథనం తరతరాలకు గుర్తుండిపోతాయి.