Bharati Raja | సినీ ప్రపంచానికి తీరని లోటు.. దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత

Bharati Raja | ద‌క్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత భారతీరాజా (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

Reported by: Sandeep | సినిమా | Jun 10, 2026, 8:09 am IST
Read Time: 6 mins
Bharati Raja | సినీ ప్రపంచానికి తీరని లోటు.. దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత

Bharati Raja | ద‌క్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత భారతీరాజా (86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. భారతీరాజా మరణ వార్తతో తమిళ సినీ పరిశ్రమతో పాటు తెలుగు చిత్రసీమ కూడా విషాదంలో మునిగిపోయింది.

‘పదహారేళ్ల వయసు’తో దర్శకుడిగా ప్రస్థానం

1977లో విడుదలైన ‘పదహారేళ్ల వయసు’ చిత్రంతో భారతీరాజా దర్శకుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. గ్రామీణ నేపథ్య కథలను సహజత్వంతో తెరకెక్కిస్తూ తమిళ సినిమాకు కొత్త దిశను చూపించారు. ఆ తర్వాత ఆయన రూపొందించిన ఎన్నో చిత్రాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. ప్రేమ, కుటుంబ బంధాలు, గ్రామీణ జీవన విధానాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు కూడా చిరస్మరణీయ చిత్రాలు

తమిళంతో పాటు తెలుగులోనూ భారతీరాజా తనదైన ముద్ర వేశారు. ‘సీతాకోకచిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’, ‘ఈతరం ఇల్లాలు’, ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’, ‘కొత్త జీవితాలు’, ‘యువతరం పిలిచింది’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన సినిమాల్లో భావోద్వేగాలకు, కథనానికి ఇచ్చిన ప్రాధాన్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

నటుడిగానూ విశేష గుర్తింపు

దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ భారతీరాజా విశేష గుర్తింపు పొందారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల వచ్చిన పలు తమిళ చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. దర్శకుడిగా చివరిసారిగా ‘మీండుం ఒరు మరియాదై’ చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన, అనంతరం నటుడిగా మాత్రమే కొనసాగారు.

కుమారుడి మరణం తీవ్రంగా కలిచివేసింది

గత ఏడాది భారతీరాజా జీవితంలో జరిగిన విషాదం ఆయనను తీవ్రంగా కుంగదీసింది. ఆయన ఏకైక కుమారుడు మనోజ్ భారతీరాజా ఆకస్మికంగా మరణించడం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నటుడిగా, దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలోనే కుమారుడు కన్నుమూయడం భారతీరాజాను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది.

ఈ విషాదం నుంచి బయటపడేందుకు కొంతకాలం కుటుంబ సభ్యులతో విదేశాల్లో గడిపిన ఆయన, అనంతరం చెన్నైకి తిరిగి వచ్చారు. అయితే అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదని సన్నిహితులు చెబుతున్నారు.

గ్రామీణ కథలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడిగా, ఎన్నో కొత్త ప్రతిభలను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గురువుగా భారతీరాజా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక గొప్ప మ‌హా మ‌నిషిని కోల్పోయింది. దర్శకుడిగా, నటుడిగా, సినీ గురువుగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. భారతీరాజా లేని లోటు చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ తీరనిదే.