విధాత, హైదరాబాద్: ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఈసీ తమిళనాడు, కేరళం, వెస్ట్ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలో నిర్వహించనున్న ఎన్నికల తేదీలను, ఎన్నికల దశలు, కౌంటింగ్ షెడ్యూల్ పై పూర్తి వివరాలు వెల్లడించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ కు ముందు పార్టీల నేతలతో ఈసీ భేటీ జరిగిందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఈ భేటీలో సీఎస్, డీజీపీ, సీఈవోలు నోడల్ అధికారులు పాల్గొన్నారు. పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాటులు చేశామని సీఈసీ వెల్లడించారు. ఓటింగ్ లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.
2.18 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోసం 25 లక్షల మంది సిబ్బంది నియామకం జరిగింది. 15 లక్షల పోలింగ్ అధికారులు, 8.5 లక్షల సెక్యూరిటీ సిబ్బంది, 49,000 మంది మైక్రో అబ్జర్వర్లు 40,000 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. తమిళనాడులో ఏప్రిల్ 24న పోలింగ్ నిర్వహించనుండగా కేరళం, పుదుచ్చెరీలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ పేర్కొన్నారు. మొదటి విడతలో 152 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, రెండో విడతలో 142 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 29 పోలింగ్ నిర్వహించనున్నారు. బెంగాల్లో 294, తమిళనాడులో 234, కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అసోంలో రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 23 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 9న ఎన్నకలు నిర్వహించనున్నారు. అయితే అన్ని రాష్ట్రాల్లో నిర్వహించే ఎన్నికలకు మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికలతో పాటు మరో ఆరు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. గోవా, గుజరాత్, కర్ణాటక మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపురలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈ రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. అంటే ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రకటించడం, భారీ ప్రాజెక్టులు ప్రారంభించడం వంటి కార్యక్రమాలపై పరిమితులు అమల్లోకి వస్తాయి.
