BRS | పట్టు కోసం బీఆర్ఎస్ గట్టి ప్రణాళిక!.. వ్యూహాత్మకంగా కదుపుతున్న పావులు

పదేండ్లలో ప్రజావ్యతిరేకతను చవిచూసి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి పట్టు సాధించేందుకు గట్టి ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ దఫా వ్యూహాత్మకంగా ప్రాంతాలను ఎంచుకుని, ఉమ్మడి జిల్లాలవారీగా పావులు కదుపుతోంది.

BRS | పట్టు కోసం బీఆర్ఎస్ గట్టి ప్రణాళిక!.. వ్యూహాత్మకంగా కదుపుతున్న పావులు

మూడు ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత

ముందుగా 50 అసెంబ్లీ స్థానాలపై గురి

విధాత, ప్రత్యేక ప్రతినిధి: పదేండ్లలో ప్రజావ్యతిరేకతను చవిచూసి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి పట్టు సాధించేందుకు గట్టి ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ దఫా వ్యూహాత్మకంగా ప్రాంతాలను ఎంచుకుని, ఉమ్మడి జిల్లాలవారీగా పావులు కదుపుతోంది. ఈ మేరకు నాయకత్వం అంతర్గతంగా లక్ష్యం చేసుకున్న ఆయా జిల్లాల పై ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలలలో మూడు కేటగిరీలుగా ఎంచుకున్న మూడు ప్రాంతాల పైన ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇక్కడ పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యల పై పోరాటం, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రజా కార్యక్రమాలు చేపట్టే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలు తొలి నుంచి పార్టీకి పట్టుగొమ్మగా, ఆటుపోట్లు, అడ్డంకుల సమయంలో వెనుదన్నుగా నిలిచి పదేండ్ల అధికారం సమయంలో చేసిన పొరపాట్లు, తప్పులకు విధించిన శిక్షగా భావించి వాటిని సరిదిద్దుకునేయత్నం చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు ఈ మూడు జిల్లాల నాయకత్వానికి ప్రత్యేక లక్ష్యాలు నిర్ధేశించి అమలు చేస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాల్లో విస్తృత చర్చసాగుతోంది.

మూడు ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత

బీఆర్ఎస్ కు పదేండ్ల పాలన తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, దాని పరిసర జిల్లాలు పార్టీకి ప్రాణం పోశాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఇందులో దాదాపు 20కి పైగా స్థానాలు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే గెలుపొందారు. మిగిలిన 19 మంది ఇతర జిల్లాల్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాత పార్టీ ప్రధాన నాయకత్వం ప్రత్యేక ప్రణాళికను రచించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ మేరకు మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకుని, ఇక్కడ మూడు రకాల ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నట్లు చర్చసాగుతోంది. ఎంపిక చేసిన ఈ మూడు ప్రాంతాల్లో పట్టు నిలుపుకుంటే దాదాపు 50కి పైగా స్థానాల్లో గెలిచి తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చినట్లేనని, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల పై వీటి ప్రభావం ఉంటుందనే లక్ష్యంతో ప్రణాళికను చాకచక్యంగా అమలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ మూడు ప్రాంతాలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగితే వచ్చే ఫలితాలు చాలని, ఈ మూడు ప్రాంతాలు మాత్రం అత్యంత కీలకమైనవిగా ఎంచుకున్నట్లు చర్చసాగుతోంది. దీని కోసం పార్టీకి మూడు స్థాయిల్లోని జిల్లాలు, గతంలో అక్కడ పార్టీ పట్టు, కష్టసమయాల్లో ఆయా జిల్లాల పాత్రను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేసినట్లుగా సమాచారం.

ప్రస్తుతం పార్టీ గెలిచిన ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో పట్టు నిలుపుకోవడానికి తొలి ప్రాధాన్యత నివ్వాలని నిర్ణయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా తిరిగి పార్టీకి జీవం పోయాలని భావిస్తున్నారు. పట్టంకట్టిన చోట పట్టు నిలుపుకోవడం తొలి ప్రాధానత్య అయితే, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తొలి నుంచి పార్టీకి అండగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు రెండవ ప్రాధాన్యత నిస్తూ తిరిగి ఇక్కడ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని యోచిస్తున్నట్లుగా సమాచారం.

ఇక మూడవ ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇక్కడ ఓటమి బీఆర్ఎస్ కు అధికారాన్ని దూరం చేయగా, ప్రత్యర్ధి కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టినట్లు భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో తిరిగి పార్టీకి ప్రాణం పొస్తే ప్రత్యర్ధి బలం తగ్గించడమే కాకుండా పార్టీకి అదనపు శక్తి చేకూరుతోందని అంచనా వేస్తున్నారు. పైగా ఈ ప్రాంతం తొలి నుంచి బీఆర్ఎస్ కు అండగా నిలిచిందనే లెక్కల్లో ఉన్నారు.

మిగిలిన ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో పార్టీని నిలబెట్టుకుంటూ రానున్న రోజుల్లో ఇక్కడ పట్టు సాధించేందుకు యత్నించాలనే ప్రణాళికతో సాగుతున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలపై ప్రత్యేక కేంద్రీకరణతో పాటు పార్టీ ఉన్నతస్థాయి కమిటీల్లో, శాసనసభా పక్షంలో ఇక్కడి ఎమ్మెల్యేలకు ప్రధాన బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. ఇక్కడి ఎమ్మెల్యేలతో నిరంతరం పార్టీ నాయకత్వం టచ్ లో ఉంటూ వారికి ప్రాధాన్యతనివ్వడమే కాకుండా తాజాగా సనత్నగర్, రాజేంద్రనగర్, ఎల్ బి నగర్ లలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడ మే కాకుండా రానున్న రోజుల్ల ఇక్కడ జరిగే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పై పట్టును సాధించాలనే లక్ష్యం కూడా ఉందంటున్నారు.

ఇక వరంగల్ జిల్లాలో పట్టు సాధించేందుకు ఇక్కడ తిరిగి పార్టీ నాయకత్వంలో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందని యోచిస్తున్నారు. పైగా ఇక్కడి నాయకత్వం పార్టీ నేతలకు నమ్మకంగా వ్యవహరించడం వారికి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఇక్కడి ప్రజల పోరాట స్ఫూర్తిని గుర్తించే రైతు సంగ్రామ సదస్సు నిర్వహించినట్లు భావిస్తున్నారు. పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తరచూ పర్యటిచడం ఇందులో భాగమేనంటున్నారు.

ఇదే స్థాయిలో ఉమ్మడి మహబూబ్ నగర్ పై నజర్ పెట్టినట్లు చెబుతున్నారు. ఈ జిల్లాల్లో ప్రజా సమస్యలు లేవనెత్తడం వల్ల ప్రభుత్వం పై ప్రధానంగా సీఎం రేవంత్ పై ఒత్తిడి పెంచడమే కాకుండా ప్రజల్లో ఎండగట్టడం సులువని భావిస్తున్నారు. ఈ కారణంగా త్వరలో ఉమ్మడి మహబూబ్ నగర్ లో పాదయాత్ర చేపట్టాలని అక్కడి నాయకత్వానికి ఇప్పటికే సూచించినట్లు సమాచారం. దీని పై ఉమ్మడి జిల్లా నాయకత్వం ప్రణాళికలు రచిచిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి దశలవారీగా పార్టీని ఒక్కో మెట్టెక్కిస్తూ తిరిగి రాష్టవ్యాప్తంగా కోల్పోయిన పరపతిని, పట్టును సాధించాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు.!!!

Read More:

పోక్సో కేసు: బండి సంజయ్‌ను కేబినెట్‌ నుంచి తొలగించాలి.. కేటీఆర్ డిమాండ్‌

హైదరాబాద్‌ నగరంలో 22 ప్రధాన రోడ్ల విస్తరణకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు