పోక్సో కేసు: బండి సంజయ్‌ను కేబినెట్‌ నుంచి తొలగించాలి.. కేటీఆర్ డిమాండ్‌

బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేబినెట్‌ నుంచి తొలగించాలని కేటీఆర్ డిమాండ్‌ చేశారు. కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలంటే ఆయన పదవిలో కొనసాగకూడదన్నారు.

పోక్సో కేసు: బండి సంజయ్‌ను కేబినెట్‌ నుంచి తొలగించాలి.. కేటీఆర్ డిమాండ్‌ బండి భగీరథ్‌ పోక్సో కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్న కేటీఆర్‌

KTR Demands Removal of Bandi Sanjay Over Bandi Bhagirath POCSO Case

  • కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలంటే తప్పించాల్సిందే : కేటీఆర్
  • 9 రోజుల పాటు ఎవరూ కాపాడారంటూ కేంద్రంపై ప్రశ్నలు

విధాత సిటీ బ్యూరో | మే 17, 2026:

హైదరాబాద్‌:బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌ నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగాలంటే బండి సంజయ్‌ పదవిలో కొనసాగకూడదన్నారు.

ఎల్బీనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌, ఒక కేంద్ర మంత్రికి చెందిన కుమారుడిపై లుకౌట్‌ నోటీసు జారీ కావడం దేశ చరిత్రలోనే అరుదైన విషయం. తొమ్మిది రోజుల పాటు అతడిని ఎవరు దాచిపెట్టారు? ఎవరి రక్షణలో ఉన్నాడంటూ ప్రశ్నించారు.

బాధిత కుటుంబాన్ని బెదిరించారన్న ఆరోపణ

కేసులో తన కుమారుడికి దూరంగా ఉండాల్సింది పోయి, బండి సంజయ్‌ స్వయంగా బాధితురాలి కుటుంబాన్ని బెదిరించారని కేటీఆర్‌ ఆరోపించారు. ఒక బాలికపై అఘాయిత్యం జరిగితే, ఆమె కుటుంబాన్నే వేధించడం దారుణమన్న కేటీఆర్​,  అలాంటి వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగడం తెలంగాణకే కాదు దేశానికే అవమానమని మండిపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన “బేటీ బచావో.. బేటీ పడావో” నినాదాన్ని ప్రస్తావిస్తూ, అధికారంలో ఉన్నవారే నిందితులను కాపాడితే ఆ నినాదాలకు అర్థమే లేదన్నారు. ప్రభావశీలులు చట్టానికి అతీతులు అన్న భావన సమాజంలో ఏర్పడితే భవిష్యత్తులో సామాన్యులు, మహిళలు, బాలికలు ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడతారని హెచ్చరించారు.

కాంగ్రెస్‌, బీజేపీ లిసే కేసును నీరుగార్చే ప్రయత్నం చేశాయి”

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసిందని కేటీఆర్‌ ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి ఈ కేసును “హనీ ట్రాప్‌”గా చిత్రీకరిస్తూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నించాయని అన్నారు. కొన్ని మీడియా సంస్థలపై కూడా ఒత్తిడి తెచ్చి నిజాలను రాయకుండా చేసారని ఆరోపించారు.

తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా పోరాడిన బాధితురాలి తల్లి, కుటుంబ సభ్యులను కేటీఆర్‌ అభినందించారు. అందరూ ఒత్తిడి తెస్తున్నా ధైర్యంగా నిలబడిన ఆ కుటుంబం సమాజానికి ఆదర్శమని కొనయాడారు.

అలాగే బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు, విద్యార్థి సంఘాలు, సోషల్‌ మీడియా కార్యకర్తలు చేసిన పోరాటాన్ని ప్రశంసించారు. మహిళా విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించిందని, మహిళా కమిషన్‌, డీజీపీని కలిసి న్యాయం కోరిందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ బాధిత కుటుంబానికి అండగా నిలిచారని తెలిపారు.

కేడర్‌, మహిళా నేతలు, ప్రజల ఒత్తిడి కారణంగానే నిందితుడు చివరకు అరెస్టయ్యాడని, దీంతో బాధితురాలికి కనీసం న్యాయం జరిగుతుందన్న ఆశ కలిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు.