విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలవచ్చు : స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని డీఎంకే అధినేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
టీవీకే చీఫ్ , తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వంపై మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలవచ్చన్న స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముందస్తు ఎన్నికలకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని స్టాలిన్ సూచించారు. పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వ కూలిపోవడానికి అవకాశాలు ఉన్నాయని, ఈ ఓటమి మనకు తాత్కాలికమేనని తెలిపారు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో డీఎంకే కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
ఓటమిపై సమీక్షకు కమిటీ నియామకం
తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు అని అని స్టాలిన్ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని స్టాలిన్ బాధ్యత తీసుకున్నారు. గతంలోనూ మనం ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకుని తిరిగి అధికారంలోకి వచ్చామని.. మళ్లీ అధికారంలోకి వస్తాం అని క్యాడర్‌లో ధైర్యం నింపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలవ్వడంతో, ఆ ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి 36 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కూడా స్టాలిన్ ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియా ప్రచారంపై ఫోకస్
ఈ సందర్భంగా ప్రత్యర్థి విజయ్ పార్టీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో దూసుకుపోతుండటాన్ని స్టాలిన్ పరోక్షంగా ప్రస్తావించారు. ఒకప్పుడు మనం టీ కొట్టుల్లో మాట్లాడిన రాజకీయాన్ని.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని పార్టీ ఐటీ వింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పిల్లలతో కూడా టీవీకే ప్రచారం చేయించి తల్లిదండ్రులను ప్రభావితం చేసిందని..ఇటువంటి ప్రచార టెక్నిక్ లపై డీఎంకే కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
స్టాలిన్ వ్యాఖ్యలను తేలిగ్గా తీసిపారేసిన టీవీకే
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ మాజీ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు డీఎంకే విమర్శలపై సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే వర్గాలు తేలిగ్గా తీసిపారేశాయి. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐదేళ్ల పూర్తి కాలం పాలిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మద్దతు పార్టీలపైనే టీవీకే సర్కార్ మనుగడ !
తమిళనాడు రాజకీయాల్లో గత 62 ఏళ్లుగా కొనసాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు. ద్రవిడ పార్టీల ఏకఛత్రాధిపత్యాన్ని బద్దలు కొడుతూ నటుడు విజయ్ టీవీకే పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవకముందే.. విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చంటూ మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వెనుక విజయ్ పార్టీకి మెజార్టీ మార్క్క అవసరమైన బలం విజయ్ పార్టీకి లేకపోవడం కారణంగా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ మార్క్ 118. టీవీకే పార్టీకి ఒంటరిగానే సొంతంగా 107 స్థానాలు ఉండగా.. మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీనికి తోడు రెండు సీట్లున్న వీసీకే, రెండు స్థానాలున్న సీపీఐ, మరో రెండు సీట్లు కల్గిన సీపీఎం, ఇంకో రెండు సీట్లున్న ఐయూఎంఎల్ పార్టీలు కూడా విజయ్‌కే మద్దతు ఇస్తుండటంతో టీవీకే ప్రభుత్వం మెజారిటీని నిలబెట్టుకుంది. వీటితో పాటు గత వారం జరిగిన విశ్వాస పరీక్షలో జోసెఫ్ విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు కూడా తోడైంది. దీంతో 144 బలంలో విశ్వాస పరీక్షలోనూ విజయ్ ప్రభుత్వం నెగ్గింది.
మద్దతు ఉపసంహరించుకోవడంపై అంచనాలు
అయితే ఈ రాజకీయ సమీకరణాలు ఎంతో కాలం సాగవని డీఎంకే వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ బయట నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ వంటి పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నా.. లేదా విపక్ష పార్టీకి చెందిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ లేదా కోర్టులు అనర్హత వేటు వేసినా విజయ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని స్టాలిన్ లెక్కలు వేసుకుంటున్నారు అందుకే విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని, 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని స్టాలిన్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. డీఎంకే (DMK) నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ సైతం తాజాగా విజయ్ ప్రభుత్వం ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిలబడదని, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ త్వరలోనే మళ్లీ సీఎం అవుతారని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాన్ని ఛేదించే క్లూ దొరికిందా? అమెరికా శాస్త్రవేత్తల కీలక అధ్యయనం..
తీరం మనదే.. బోటు మనదే.. వేట మనదే : సీఎం చంద్రబాబు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram