Tamil Nadu Politics| తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పులు..బీజేపీతో టీవీకే పొత్తు?

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు అనూహ్య పొత్తులు..విచిత్ర కూటములు అవతరిస్తున్నాయి. ఇన్నాళ్లు పరస్పరం విమర్శించుకున్న పార్టీలు ఒక్కటవుతుండగా...ఒక్కటిగా ఉన్న పార్టీలు దూరం అవుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. కొత్తగా బీజేపీ, టీవీకే మధ్య పొత్తుకు తెరలేసిందన్న ప్రచారం జోరందుకుంది.

విధాత : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందు అనూహ్య పొత్తులు..విచిత్ర కూటములు అవతరిస్తున్నాయి. ఇన్నాళ్లు పరస్పరం విమర్శించుకున్న పార్టీలు ఒక్కటవుతుండగా…ఒక్కటిగా ఉన్న పార్టీలు దూరం అవుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. నిన్నటిదాకా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీరాలు పలికిన తమిళగ వెట్రి కజగం’(టీవీకే) అధినేత, సినీ హీరో విజయ్ అనూహ్యంగా తన స్వరం మార్చి బీజేపీతో పొత్తుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వెలువడటం సంచలనంగా మారింది. అధికార డీఎంకే, కాంగ్రెస్ కూటమిని ఢీ కొట్టాలంటే బీజేపీతో కలిసి నడవాలని టీవీకే చీఫ్ విజయ్, బీజేపీలు భావిస్తున్నట్లుగా తమిళ రాజకీయవర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అటు బీజేపీ సైతం జనంలో విజయ్ కి ఉన్న ఇమేజ్ ద్వారా తమిళనాడులో పాగా వేయాలని భావిస్తుంది.  ఓట్ల శాతాన్ని పెంచుకోవడమే  లక్ష్యంగా ఈ ఆపరేషన్  చేపట్టినట్లు తెలుస్తోంది.

విజయ్ కి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్

పొత్తుకు అంగీకరిస్తే టీవీకే కు మొత్తం 234అసెంబ్లీ స్థానాల్లో 80స్థానాలు కేటాయిస్తామని, అలాగే విజయ్ కి డిప్యూటీ సీఎం పదవిని బీజేపీ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. టీవీకే అధినేత విజయ్ ని ఎన్డీఏ కూటమిలోకి తీసుకరావడంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెర వెనుక కీలకంగా వ్యవహరించినట్లుగా సమాచారం. పార్టీని ప్రకటించిన సమయంలో విజయ్ తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, ప్రజలకు స్వతంత్ర ప్రత్యామ్నాయంగా నిలుస్తామని అప్పట్లో ప్రకటించారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో కూడా విజయ్ బీజేపీతో పొత్తుకు నో చెప్పారు. అయితే అంతలోనే బీజేపీతో పొత్తు విషయమై విజయ్ నిర్ణయం మారినట్లుగా ప్రచారం సాగుతుంది.

విజయ్ సన్నిహితులు, రాజకీయ సలహాదారులలో కొందరు ఎన్డీఏ కూటమిలో చేరడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ప్రాక్టికల్ ఆలోచిస్తే ఓట్ల చీలికను నివారించేందుకు కూటమిలో చేరాలని సూచిస్తున్నారు. తమిళ రాజకీయాల్లో అధికార డీఎంకే కూటమితో పాటు అన్నాడీఎంకే, బీజేపీ ఎన్డీఏ కూటమి, టీవీకే సహా కొత్తగా దివంగత మాజీ సీఎం నెచ్చెలి శశికళ కొత్త పార్టీ మధ్య ఎన్నికల్లో ఆసక్తికర పోరు కొనసాగబోతుంది. ఈ పరిస్థితుల్లో 2శాతం ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉండటంతో బీజేపీ విజయ్ పార్టీతో పొత్తుకు ఆసక్తి చూపుతుంది.

Latest News