IMD
విధాత: దేశవ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో భారీ, మరికొన్ని రాష్ట్రాల్లో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తర భారతదేశాన్ని ఎడతెరిపిలేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌కు రెడ్ అలెర్ట్, ఢిల్లీ ఎల్లో అలెర్ట్ జారీచేసింది. వాతావరణ కేంద్రం జారీ చేసే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లకు అర్థం ఏంటి..? అని తెలుసుకోవాలని ఉన్నదా? అయితే ఇది చదవండి.
పరిస్థితుల తీవ్రతను వెల్లడికే రంగలు
వర్షాలు కురిసినప్పుడు పసుపు (Yellow Alert) , నారింజ (Orange Alert) , ఎరుపు రంగు (Red Alert) వార్నింగ్స్ వాతావరణ శాఖ ఇస్తుంటుంది. వాతావరణ పరిస్థితుల తీవ్రతను వెల్లడించడానికి ఐఎండీ ఈ రంగుల విధానాన్ని ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణ శాఖ వీటిని వెల్లడిస్తున్నది.
ఇలా రంగుల రూపంలో చెప్తే సామాన్యులకు సైతం సులభంగా అర్థమవుతుందని, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం సులభమతుందనేది ఈ రంగుల హెచ్చరికల ఉద్దేశం. మొదట ఆకుపచ్చ రంగు, పసుపు, నారిజం, ఎరుపు అంటూ నాలుగు రకాల రంగులు వాడేవారు.
ఆకుపచ్చ అంటే ఎలాంటి చర్యలు అవసరం లేదని, పసుపు అంటే సిద్ధంగా ఉండమని, నారింజ అంటే సంసిద్ధులుకండి అని, ఎరుపు అంటే చర్యలు తీసుకోమని అర్థం. ఈ రంగుల కేటాయింపును ఐఎండీ ఐదు రోజుల వాతావరణ పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటుంది.
మెట్రోలాజికల్ అంశాలు, హైడ్రోలాజికల్ అంశాలు, జియోఫిజికల్ అంశాలను పరిగణనలోకి తీసుకొని వర్షాల తీవ్రతను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా హెచ్చరికలు జారీ చేస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఇదే కలర్ కోడ్‌ను వాడతారు.
ఆకుపచ్చ రంగు
వర్షం పడే అవకాశం లేని సమయాల్లో వాతావరణ శాఖ ఆకుపచ్చ రంగును చూపిస్తుంది. అంటే అది ఆటోమేటిక్‌గా ఉంటుందన్నమాట. సాధారణ వాతావరణ పరిస్థితులను ఆకుపచ్చరంగు సూచిస్తుంది. వర్షం పడే సూచనలు ఉంటేనే ఆకుపచ్చ నుంచి రంగు మారుతుంది.
పసుపు అలర్ట్ (Yellow Alert)
ఎల్లో అలర్ట్ అంటే ప్రజలను అప్రమత్తం చేయడానికి ఇస్తారు. ప్రమాదం పొంచి ఉన్నది అనేదానికి సూచనగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అంటే దాని ఉద్దేశం అప్రమత్తంగా ఉండమని చెప్పడం. 7.5 మిల్లీమీటర్ల నుంచి 15 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం సుమారు గంట నుంచి రెండు గంటల వరకు పడే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ ఇస్తారు.
ఆరెంజ్ అలర్ట్ (Orange Alert)
వాతావరణ పరిస్థితి తీవ్రంగా మారితే ఎల్లో అలర్ట్.. ఆరెంజ్ అలర్ట్‌గా మారుతుంది. వాతావరణ పరిస్థితులు మరింత దిగజారినప్పుడు ఆరెంజ్ అలర్ట్ ఇస్తారు. ఒక రోజులో 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయినప్పుడు @సిద్ధంగా ఉండండి* అని ఆరెంజ్ అలర్ట్ జారీచేస్తారు. వర్షాల వల్ల రోడ్డు రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తినష్టం, ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం ఉన్న సమయాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇస్తారు.
రెడ్ అలర్ట్ (Red Alert)
రెడ్ అలర్ట్ అంటే భయానక పరిస్థితి. సహజంగా తుఫాన్లు వచ్చినప్పుడు, 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తాయనే అంచనా ఉన్నప్పుడు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణం డేంజర్ లెవల్స్ దాటినప్పుడు, ఎక్కువ నష్టం జరుగుతుందని భావించినప్పుడు రెడ్ అలర్ట్ ఇష్యూ చేస్తారు.
‘రెడ్’ అలర్ట్ అనేది ‘చర్య తీసుకోండి అని చెప్పే హెచ్చరిక. ఇది ఒక రోజులో 204.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు జారీ చేస్తారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులను కూడా దీనికి తగినట్టు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్తారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన సమయంగా హెచ్చరిస్తారు.