Gandhari khilla | నిండు కుండ‌లా ‘స‌వ‌తుల బావులు’.. ఆశ్చ‌ర్య‌పోతున్న ప‌ర్యాట‌కులు

Gandhari khilla | ర‌మ‌ణీయ‌త‌తో కూడిన ప్ర‌కృతి.. చుట్టూ ద‌ట్ట‌మైన అడ‌వి.. కొండ‌పై ప‌చ్చ‌ద‌నం.. శ‌తాబ్దాల నాటి కోట‌.. అందులోనూ రాతి ద్వారాలు.. సొరంగ మార్గాలు.. స‌వ‌తుల బావులు( Savathula Bavulu ).. ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌ను పొదిగి ఉన్న గాంధారి ఖిల్లా( Gandhari khilla ) గుట్ట ప‌ర్యాట‌కుల‌ను ఎంతో ఆక‌ర్షిస్తోంది. ఎందుకంటే మండుటెండ‌ల్లోనూ స‌వ‌తుల బావులు నిండు కుండ‌ను త‌ల‌పిస్తున్నాయి. ఆ నీటిని చూసి ప‌ర్యాట‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Gandhari khilla | మంచిర్యాల జిల్లా( Mancherial district ) మంద‌మ‌ర్రి మండ‌లం బొక్క‌ల‌గుట్ట( Bokkalagutta ) స‌మీపంలోని గాంధారి ఖిల్లా( Gandhari khilla ) గుట్ట‌పై సవ‌తుల బావులు ఉన్నాయి. ఇవి శ‌తాబ్దాల క్రితం నీటి యాజ‌మాన్య ప‌ద్ధ‌తులకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. కొండ‌రాతిని తొల‌గించి ఈ స‌వ‌తుల బావుల‌ను( Savathula Bavulu ) నిర్మించారు. అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ బావుల్లో నీటిని నింపేవారు. ఏనుగులు, గుర్రాలు సుల‌భంగా నీరు తాగేలా మెట్ల‌తో అద్భుతంగా ఈ స‌వ‌తుల బావుల‌ను తీర్చిదిద్దారు.

తీవ్రమైన వేసవిలోనూ కోటపై ఉన్న మూడు బావుల్లో నీరు ఎండిపోకుండా ఉండటం విశేషం. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ బావులను తిలకించడానికి పర్యాటకులు, ట్రెక్కింగ్‌ చేసేవారు, చరిత్రకారులు ఆసక్తి చూపుతుంటారు. గుట్టపై నిర్మించిన కోటలో అనేక కళారూపాలు, విగ్రహాలు, ఆలయ శిల్ప సౌందర్యానికి అద్దం పడుతున్నాయి.

గిరిజనుల ఆరాధ్య దైవం

ఖిల్లా గుట్ట‌ల‌పై కొలువై ఉన్న గాంధారి మైస‌మ్మ‌.. గోండులు, మన్నెలు, మెకాసి, నాయక్‌పోడ్‌లు, కోయ గిరిజనులకు ఆరాధ్య దైవం. ప్ర‌తి ఏడాది ఫిబ్ర‌వ‌రి మాసంలో ఇక్క‌డ పెద్ద ఎత్తున జాత‌ర జ‌రుగుతుంది. తెలంగాణ‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. మైసమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. కోట సమీపంలోని పాలవాగులోని పవిత్ర జలాన్ని ఇండ్లకు తీసుకెళ్తారు. ఈ నీటిని పొలాల్లో చల్లితే, మంచి దిగుబడి వస్తుందని గిరిజనుల విశ్వాసం. ‘గాంధారి’ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది.

ఖిల్లా చారిత్రక నేపథ్యం..

అటవీప్రాంతంలో ఉన్న ‘గాంధారి ఖిల్లా’ కేంద్రంగా కాకతీయ సామంతరాజులైన గోండు రాజులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. సుమారు వేయి సంవత్సరాల కిందట రాష్ట్రకూటులు ఈ కోటను నిర్మించారని చెబుతారు. రాష్ట్రకూటుల నుంచి కాకతీయుల వరకు నాటి రాజుల శాసనాలు నేటికీ కోటలో కనిపిస్తాయి. గిరిజనుల ఇలవేల్పు ‘గాంధారి’ మైసమ్మ ఇక్కడ కొలువై ఉంది. అమ్మవారితో పాటు భైరవుడు, శివుడు, వేంకటేశ్వరుడు, ఆంజనేయుడి విగ్రహాలు గుట్టపై చూడొచ్చు. ద్వాపర యుగంలో దుర్యోధనుడు ఈ గుట్టపై కొన్నాళ్లు ఉన్నాడని స్థానికులు చెబుతారు. తన తల్లి గాంధారి పేరిట కోటను నిర్మించాడని, ఆ క్రమంలో ఈ ప్రాంతానికి ‘గాంధారి ఖిల్లా’ అని పేరు వచ్చిందంటారు.

Latest News