• Telugu News
  • /Telangana

మా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వండి: కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, సీఆర్ పాటిల్‌ను కలిసి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతులు వేగవంతం చేయాలని కోరారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 05, 2026, 4:18 pm IST
Read Time: 4 mins
మా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వండి: కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బుధవారం వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఢిల్లీ పార్లమెంట్ హౌస్ యానెక్స్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు కూడా ఈ ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో చేపట్టే వివిధ కీలక సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు సంబంధించిన పర్యావరణ, అటవీ అనుమతులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్, డిండి, గౌరవెల్లి వంటి ప్రధాన ప్రాజెక్టులతో పాటు ప్రాణహిత-చేవెళ్ల (తుమ్మిడిహెట్టి) బ్యారేజీ పనులకు ఎదురవుతున్న అటవీ క్లియరెన్సులపై కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో శ్రమ్ శక్తి భవన్‌లో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. తుంగభద్ర నదీ జలాల వివాదం, ప్రాజెక్టుల ఎత్తుల పెంపుతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన వివిధ ప్రాజెక్టు నిధులు, అనుమతులపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ అభివృద్ధి పనుల్లో కేంద్రం వేగంగా స్పందించి తగిన అనుమతులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రులకు సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్రతో చ‌ర్చ‌ల‌కు జోక్యం చేసుకోవాల‌ని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ కోరారు. 148 మీట‌ర్ల ఎత్తు నిర్మాణానికి గతంలోనే మ‌హారాష్ట్ర అంగీక‌రించిన విష‌యాన్ని కేంద్ర మంత్రి పాటిల్‌కు తెలియ‌జేశారు. 150 మీట‌ర్ల ఎత్తుతో నిర్మాణానికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. 150 మీటర్లకు పెంచినా ముంపు 1000 హెక్టార్ల లోపు ఉంటుంద‌ని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు రేవంత్ రెడ్డి వివరించారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తిపోత‌ల ఖ‌ర్చు లేకుండా గ్రావిటీతో నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.