నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించినందుకు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందానికి అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పం నెరవేరిందన్నారు. నిమ్స్ లో ఇప్పటివరకు నిర్వహించిన రొబోటిక్ సర్జరీల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమని అన్నారు.
ఇటీవలే రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవటం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పిందన్నారు. వైద్య రంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.