• Telugu News
  • /National

మూడు ఉప ఎన్నికల్లో బీజేపీకి రెండు చోట్ల ఎదురుదెబ్బ

బీహార్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించగా, దాతియాలో కాంగ్రెస్ గెలిచింది. గుజరాత్‌లో మాత్రం బీజేపీ విజయం సాధించింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Aug 03, 2026, 5:22 pm IST
Read Time: 5 mins
మూడు ఉప ఎన్నికల్లో బీజేపీకి రెండు చోట్ల ఎదురుదెబ్బ

బీహార్, గుజరాత్ , మధ్యప్రదేశ్‌లలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బీహార్‌లోని బంకిపూర్, గుజరాత్‌లోని మంజల్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. సోమవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు ఓడిపోయారు. నీట్ పేపర్ లీకేజీపై విద్యార్ధుల నిరసనల అనంతరం జరిగిన పోలింగ్ లో జెన్ జీ ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించారని ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా 1995నుంచి బీజేపీకి కంచుకోటగా నిలిచిన బంకీపూర్ లో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి సంచలనంగా మారింది. వరుసగా ఇక్కడి నుంచి ఐదుసార్లు గెలిచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.

బంకీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో జన్‌ సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‌ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై దాదాపుగా 19వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. . ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

అటు గుజరాత్ లోని మంజల్ పూర్ ఉపఎన్నిక ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి అభ్యర్థి సతీష్ పటేల్ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బిఖాభాయ్ రబరీపై 30 వేల 630 ఓట్ల తేడాతో గెలిచారు. సతీష్ పటేల్ కు మొత్తం 55 వేల 481 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి 24 వేల 851 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.

ఇక మధ్యప్రదేశ్ లోని దాతియా నియోజకర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యాం సింగ్ సమీప బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 12వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

30 ఏళ్ల ఆధిపత్యం 30 రోజుల్లోనే కూలిపోయింది: ప్రశాంత్ కిశోర్‌

30 ఏళ్ల ఆధిపత్యం 30 రోజుల్లోనే కూలిపోయిందని జన్‌ సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‌ అన్నారు. బిహార్‌లోని బంకీపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అనంతరం ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. బిహార్‌ నుంచి లక్షల మంది వలసలు పోతున్నారని, ఎన్డీయే పాలనలో రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగలేదు అని విమర్శించారు. వారి పాలనలో గుజరాత్‌ మాత్రమే అభివృద్ధి చెందిందని అన్నారు.

తనను ఓడించేందుకు బంకీపూర్ లో బీహార్ సీఎం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, 27 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీలు,
కేంద్ర మంత్రులు ప్రచారం చేశారని, బోజ్‌పురీ సినీ తారలు, మోదీ మీడియా తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, అయినా బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీ 15,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆ పార్టీ చెంపపెట్టు అని..ఇదీ ప్రజాస్వామ్య విజయం అని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.