హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విధాత ప్రతినిధి):
Hyderabad Musi River Encroachments | గత నాలుగైదు సంవత్సరాల్లో ప్రకృతి పగబడితే విధ్వంసాలు ఎలా ఉంటాయో చూస్తున్నాం. తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా కుంభవృష్టి విలయం ఎలా ఉంటుందనేది కొద్దిగా చూపించింది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కురవాల్సిన వర్షం రెండు మూడు గంటల్లో కురవడంతో జనజీవనం అతలాకుతలం అయి, ఎక్కడికక్కడ రవాణా స్థంభించిపోయింది. అయినా పాలకులు దీని నుంచి పాఠాలు నేర్చుకుని సరిదిద్దే ప్రయత్నం చేయడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి ఆకస్మిక వరదలు వస్తే మూసీలో ప్రవహించేందుకు అనేక అడ్డంకులు ఉన్నాయని, తొలగించాల్సిందేనని నీటి పారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడో నివేదిక సమర్పించింది. 1.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించేందుకు వీలుగా కబ్జాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈ నివేదికను చూసి పక్కనబెట్టారు గత పాలకులు, ప్రస్తుత పాలకులు. కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నది వాస్తవమే కానీ 36వేల క్యూసెక్కులకే మూసీ ఇంతటి విధ్వంసాన్ని మిగల్చడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నగరంలో చెరువులు, కుంటల పరిరక్షణ కోసం హెచ్ఎండీఏలో అర్బన్ లేక్ ప్రాజెక్టును ఏర్పాటు చేయగా, బీఆర్ఎస్ హయాంలో మూసీ ప్రక్షాళన కోసం మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ రెండు నిధుల కోసం తప్పితే వీసమెత్తు కూడా పనిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. వీటి పేరుతో నిధుల దుబారా, ప్రజలకు భారం తప్పితే ప్రయోజనం శూన్యం అని విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. ఆ లోపు మూసీలో కబ్జాలను హైడ్రా తొలగిస్తుందా? మూసీ పునరుద్ధరణ జరుగుతుందా? కేవలం అప్పులు రాబట్టేందుకు హంగూ ఆర్భాటమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కళ్లముందే ప్రకృతి విధ్వంసాలు
మన కళ్ల ముందే ప్రకృతి విధ్వంసాలు కన్పిస్తున్నాయి. కుంభవృష్టితో ఖమ్మం పట్టణాన్ని మున్నేరు ముంచెత్తింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుడమేరు వరదలు విజయవాడను అతలాకుతలం చేశాయి. వరంగల్, కామారెడ్డి ఉదాహరణలు చూశాం. కేరళలోని వాయనాడ్‌లో కొండచరియల విధ్వసం తెలిసిందే. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోరంచపల్లి వాగు ఉధృతికి మొత్తం గ్రామం కొట్టుకుపోయింది. ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో ప్రకృతి విధ్యంసానికి వేల ఎకరాల్లో చెట్లు నేలమట్టం అయ్యాయి. ఆ తరువాత ప్రభుత్వాలు శాస్త్రీయ అధ్యయనాలు చేయించడం, నివేదికలు తెప్పించుకోవడం, అటకెక్కించడం కూడా జరిగిపోయాయి.
ప్రక్షాళన పేరుతో నిధుల స్వాహా!
పునరుజ్జీవం, పునరుద్ధరణ, పునర్వైభవం.. ఏదైతేనేమీ ఈ పేర్లన్నీ మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వాలు బాగా వాడుకుంటున్నాయనే వాదనలు ఉన్నాయి. మూసీలో 1.50 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. అంటే.. ప్రస్తుత మూసీని 237.48 మీటర్ల వెడల్పు వరకు ఉండేలా చూడాలి. అప్పుడే 1.50 లక్షల క్యూసెక్కుల నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రవహిస్తుంది. నార్సింగి నుంచి నాగోల్ వరకు మూసీ పరీవాహక ప్రాంతంలో అనేక కబ్జాలు వచ్చాయి. మూసీలో 11వేల వరకు ఆక్రమణలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఇందులో బహదూర్ పురా, కార్వాన్, నాంపల్లి, మలక్ పేట, అంబర్ పేట నియోజకవర్గాల్లోనే 70 శాతం ఆక్రమణలు ఉన్నాయని చెబుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో కబ్జాలను తొలగించేందుకు రెండు రంగులతో మార్కింగ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీవాహక ప్రాంతంలో ఉన్న పేదలు హడలిపోయారు. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం చేసి అందచేస్తామని చెప్పినప్పటికీ విన్పించుకోలేదు. రెడ్ మార్క్ రివర్ బెడ్ గా, బ్లూ మార్క్ వరద పొటెత్తినప్పుడు అక్కడి వరకు వరద వస్తుంది అనేదానికి మార్కింగ్. ఈ రెండు మార్కుల మధ్యనున్న ఇళ్లు మూసీ నది ప్రక్షాళనలో తొలగించాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉండగా 134 చెరువులు కబ్జాదారులు చెరబట్టారు. 134 చెరువుల్లో 15వేల అక్రమ నిర్మాణాలు. ఇవి కాకుండా నాలాల్లో 20వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయి.
గతంలో భారీ వర్షాలు, కుంభవృష్టి
హైదరాబాద్ నగరాన్ని 1908 సంవత్సరం నుంచి వర్షాలు వెంటాడుతున్నాయి. అప్పటితో పోల్చితే ఇప్పుడు మునిగింది రవ్వంతే. అయినా ప్రజలు వర్షం పడుతుందంటే వణికిపోతున్నారు. బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం అయ్యే పరిస్థితి తలెత్తింది. కుంభవృష్టితో 1908 లో 50వేల మంది గల్లంతయ్యారు. నగరవ్యాప్తంగా 80 వేల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. మూసీపై నిర్మించిన మూడు బ్రిడ్జీలు గాయబ్ అయ్యాయి. ఈ కుంభవృష్టి భీభత్సం ఫలితమే నగరం ఎగువన హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలు వచ్చాయి. మూసీ పరీవాహకం పొడవునా రిటెయినింగ్ వాల్స్ నిర్మించారు. భారీ రాళ్లతో నిర్మాణం చేసినప్పటికీ అందులోకి చొచ్చుకుపోయి వ్యవసాయం, వాహనాల అక్రమ పార్కింగ్, గేదెల షెడ్లు, గుడులు, మసీదులు, ఇళ్ళు నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే. వీటి వెనకాల స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారనేది జగమెరిగిన సత్యం. నగరంలో నివసిస్తున్న వారికి ఊహ తెలిసినప్పటి నుంచి పరిశీలిస్తే… చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో 2000 సంవత్సరంలో వర్షాలు కుండపోతగా కురిశాయి. అప్పుడు అశోక్ నగర్, పద్మా కాలనీ, టోలీచౌకి తదితర ప్రాంతాల్లో పడవల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలు, శిబిరాలకు తరలించారు. హుస్సేన్ సాగర్ నాలా పొంగిపొర్లడంతో నాలాలకు ఇరువైపులా ఉన్న ఇళ్లు మునిగిపోయాయి. ఆ తరువాత నాలాల వెంట ఉన్న కబ్జాలను తొలగించేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోగా, అప్పటి ముషీరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే కే లక్ష్మణ్ అడ్డుకున్నారు. నాలా పొడవునా మార్కింగ్ కూడా చేసినా ఒక్క అంగుళం కూడా కబ్జాలను తొలగించలేకపోయారు. 2016, 2020లో కూడా భరీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. 2024 సంవత్సరాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు మునిగాయి. తాజాగా ఈ ఏడాది కురిసిన కుంభవృష్టి తో ప్రళయం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం.
మిగిలింది మూడేళ్లే ప్రక్షాళన అవుతుందా.. లేదా?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చే డిసెంబర్ నెలతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఇక ఆ తరువాత మూడేళ్లు మాత్రమే అధికారంలో కొనసాగుతుంది. ఆరు నెలల ముందు నుంచే ఎన్నికల హడావుడి, ఓట్ల కోసమే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలకు నచ్చని, వ్యతిరేక నిర్ణయాలను పట్టించుకోరు, పక్కనపెడతారు. కబ్జాలను తొలగించేందుకు, ప్రభుత్వ భూముల్లో వెలసిన ఆక్రమణలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అయితే అనుకున్నంత స్థాయిలో కబ్జాల తొలగింపు జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. తమకు గిట్టని వారి ఆస్తులను, రాజకీయ బలం లేని వారిపై హైడ్రా ప్రతాపం చూపిస్తున్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక దశలో హైడ్రా ప్రతాపానికి ఆత్మహత్యలకు కూడా పరిస్థితి దారి తీసింది. రెండున్నర ఏళ్ల సమయంలో మూసీలో కబ్జాలు తొలగించడం, వారికి పునరావాసం కల్పించడం, అభివృద్ధి చేయడం సాధ్యమయ్యేనా? అనే అనుమానాఆలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముందుగా హైడ్రాను రంగంలోకి దింపి ఆక్రమణదారులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వారికి పునరావాసం పక్కాగా ఏర్పాటు చేయాలి. 11వేల ఆక్రమణలు తొలగించడానికి ఎంత తక్కువ సమయం తీసుకున్నా ఏడాది పడుతుందని రెవెన్యూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. శాంతి భద్రతల పరంగా, స్థానిక ప్రజా ప్రతినిధుల వ్యతిరేకత కూడా వస్తుందని, వీటిని ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాలని చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా నగరం నుంచి మంత్రివర్గంలో చోటు లేకపోవడం కూడా మైనస్ గా తయారైందనే వాదనలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ పెత్తనంపై నగర కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. మూసీ పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆరంభ శూరత్వం తప్ప ఏమీ జరగ లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు దానికి ఇద్దరు ప్రజా ప్రతినిధులను చైర్మన్‌లుగా నియమించారు. ఈ మధ్య మరో ఐఏఎస్ అధికారిని నియమించారు. చిత్తశుద్ధితో హైడ్రా, మూసీ కార్పొరేషన్ సమన్వయం చేస్తే, అసెంబ్లీ ఎన్నికల నాటికి మూసీకి ఒక రూపం, పర్యాటకం వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Musi River । కాలుష్యం బారి నుంచి మూసీ నదిని ప్రక్షాళన చేయడంలో ఎవరి బాధ్యత ఎంత?
Musi river । మూసీ ప్రక్షాళనపై పాలకుల చిత్తశుద్ధి ఎంత? మూసీ ప్రక్షాళన కథలు.. పార్ట్ 2