Upasana | మెగా కోడలు, వ్యాపారవేత్తగా పేరుగాంచినఉపాసన కొణిదెల ప్రస్తుతం కుటుంబం, వ్యాపారం రెండింటిని బ్యాలెన్స్డ్‌గా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. రామ్ చరణ్ భార్యగా, అపోలో సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉపాసన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ఆమె ఇద్దరు కవలలకి జన్మనివ్వగా, మాతృత్వాన్ని అనుభవిస్తూ కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.
ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ఆసక్తి
ఉపాసన అపోలో హాస్పిటల్స్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న కుటుంబానికి చెందినవారు. ఈ సంస్థను ఆమె తాత ప్రతాప్ .సి. రెడ్డి స్థాపించారు. అయితే ప్రారంభంలో ఉపాసనకు ఈ రంగంలోకి రావాలనే ఆసక్తి లేదట. తాను ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్లాలని అనుకున్నట్లు ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే ఈ విషయం తాతయ్యకు చెప్పినప్పుడు, “ఫ్యాషన్ రంగంలో తక్కువ మందికే సేవ చేయగలవు. కానీ ఆరోగ్య రంగంలో లక్షల మందికి సేవ చేయగలవు. అందుకే ఎక్కువ మందికి ఉపయోగపడే రంగం గురించి ఆలోచించు” అని ఆయన సూచించినట్లు ఉపాసన చెప్పారు.
ఆలోచన మార్చిన సంఘటన
ఒక రోజు అపోలో ఆసుపత్రికి వెళ్లిన సమయంలో జరిగిన సంఘటన ఉపాసన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక పేద భవన నిర్మాణ కార్మికురాలు తన కొడుకు ప్రాణాలను కాపాడాలని ఆసుపత్రిలో వేడుకున్నట్లు ఉపాసన తెలిపారు. ఆ బాలుడు తీవ్రమైన పరిస్థితిలో ఉండటంతో చికిత్సకు చాలా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.
అప్పుడు ఆ ఖర్చును తానే భరిస్తానని చెప్పి వెంటనే చికిత్స చేయమని ఉపాసన సూచించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ బాలుడిని కాపాడలేకపోయారు. దీంతో ఆ తల్లి తీవ్రంగా విలపించింది. ఇప్పటికే ఆమెకు పుట్టిన ముగ్గురు పిల్లలు కూడా వివిధ కారణాలతో చనిపోయిన నేపథ్యంలో నాలుగో సంతానం కూడా కోల్పోవడంతో ఆమె బాధ వర్ణించలేనిదిగా మారింది.
సేవలోనే ఆనందం
ఆ సంఘటన ఉపాసనను తీవ్రంగా కదిలించింది. ఆ తల్లికి తనవంతు సహాయం అందించినట్లు ఆమె తెలిపారు. కొంతకాలం తర్వాత అదే మహిళ మళ్లీ గర్భం దాల్చగా, ఈసారి పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా బతికిందట. ఆ సమయంలో ఆ తల్లి ఆనందాన్ని చూసినప్పుడు సేవ చేయడంలో ఉన్న అసలు సంతృప్తి తనకు అర్థమైందని ఉపాసన వెల్లడించారు. ఆ సంఘటనతోనే తన ఆలోచన మారిపోయిందని చెప్పారు.
సామాజిక సేవలో ఉపాసన
ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ పై ఉన్న ఆసక్తిని పక్కన పెట్టి అపోలో ఆసుపత్రులను మరింత అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి కృషి చేస్తున్నట్లు ఉపాసన తెలిపారు. చిన్నారుల గుండె సమస్యల చికిత్స కోసం “Save a Child’s Heart” వంటి కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు. అలాగే క్యాన్సర్ బాధిత పేదలకు “CURE” వంటి కార్యక్రమాల ద్వారా ఉచిత సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.
సినిమాల్లో బిజీగా రామ్ చరణ్
ఇక ఉపాసన భర్త రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్లోబల్ స్టార్‌గా ఆయన ఎదిగారు. ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న “పెద్ది” సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ కనిపించనున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
