Site icon vidhaatha

Warangal Floods | కన్నీటి తడారని మోరంచపల్లి.. వరద మిగిల్చిన గుండెకోత

Warangal Floods

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూపాల్ పల్లి జిల్లా మొరంచ పల్లెలో కన్నీటి తడి ఇంకా ఆరడం లేదు. ఎటు చూసినా విషాదం అలుముకుంది. పల్లె వాసుల్లో గురువారం రాత్రి సృష్టించిన కల్లోలం నుంచి ఇంకా తేరుకోవడం లేదు. వరద, వాన అంశం లేవనెత్తితే పల్లె ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. బంధువులను కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు గొల్లుమంటున్నారు. పల్లెలో వరద బీభత్సానికి నలుగురు గల్లంతు కాగా ముగ్గురు మృతదేహాలు మూడు కిలోమీటర్ల దూరంలో మూడు రోజుల తర్వాత పోలీసులు కనుగొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం స్థానిక పోలీసులు డ్రోన్ సహకారంతో చేపట్టిన తనిఖీలతో మృతదేహాలు కనుగొన్నారు. దేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

వరద ప్రవాహంతో ఊరంతా ఊడ్చుక పోయి, అన్ని కోల్పోయిన అనాధలుగా మారారు. ఏ ఇంటిని కదిలించిన కన్నీటి ప్రవాహం కనిపిస్తోంది. సమీప బంధువులు, ఇతర ప్రాంతాల్లోని తమ కుటుంబ సభ్యులు, రాకపోకలు పరామర్శాలతో ఊరంతా కన్నీటి సంద్రంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, బంధువుల పరామర్శలతో ఇప్పుడు మోరంచ పల్లి గుండె కోతతో తల్లడిల్లుతోంది.గ్రామ ప్రజలు, గ్రామం కుదుటపడాలంటే నెలలు గడిచే అవకాశం ఉంది అతిభారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లిని మోరంచవాగు ముంచేసింది. సుమారు 1500 మంది పై చిలుకు జనం ఉండే గ్రామం.. పూర్తిగా మునిగిపోయింది.

– మూడు మృతదేహాలు లభ్యం

వరద ఉధృతికి నలుగురు గల్లంతయ్యారు. వరద తగ్గుముఖం పడుతుండడంతో మృతదేహాలు బయటపడుతున్నాయి. మొన్న రాత్రి గల్లంతైన గొర్రె ఆదిరెడ్డి, వజ్రమ్మ, సరోజన మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మోరంచ వాగు వరదలో గురువారం ఉదయం కొట్టుకపోయిన గొర్రె ఆదిరెడ్డి మృతదేహం చిట్యాల మండలం పాచిగడ్డ తండా శివారు పొలాల్లో లభ్యమైంది. సోలిపేట తాళ్లు మండవ దగ్గర కట్ట లోపలిలో ఉన్న పొలాల దగ్గర మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.

మోరంచపల్లికి చెందిన గంగిడి సరోజనగా పోలీసులు చెబుతున్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో మృతదేహాలు కనిపించాయి. తమ వారి మృతదేహాలు బయటపడుతుండటంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మోరంచపల్లిలో వందల సంఖ్యలు బర్రెలు, కోళ్లు మృత్యువాత పడ్డాయి. గొర్రెల మందలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సర్వం వరదనీటిలో కోల్పోయి మోరంచ పల్లె వాసులు ఒక్కసారిగా బికారులుగా మారారు.

Exit mobile version