Site icon vidhaatha

ఐదేళ్ల‌లో బండి ఐదుపైస‌ల ప‌ని కూడా చేయ‌లేదు: బీఆరెస్ అభ్య‌ర్థి వినోద్ కుమార్‌

*పదేళ్ళలో ఏం చేయలేదు కాబట్టే బీజేపీ మతరాజకీయాలు చేస్తుంది

*అబద్దాల కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం

*ఆరు గ్యారెంటీలు లేవు…రైతు ఋణమాఫీ లేదు

విధాత బ్యూరో, కరీంనగర్: దేశంలో బీజేపీ మతరాజకీయాలు చేస్తూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నదని, పదేళ్ళలో చేసిన అభివృద్ధి చెప్పలేకనే దేవుడి పేరు చెప్పి ఓట్ల రాజకీయం చేస్తుందని కరీంనగర్ బీఆరెస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్, అనంతరం కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల బీఆరెస్‌ ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్ కు ఐదు పైస‌ల‌ పని చేయలేదని వినోద్‌కుమార్‌ ఆరోపించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్న బండి సంజయ్ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాల అభివృద్ధికి నయా పైసా తీసుకురాలేక పోయారన్నారు. బండి సంజయ్ అసమర్థత కారణంగానే, కరీంనగర్ కు రావాల్సిన ట్రిబుల్ ఐటీ ఇతర రాష్ట్రాలకు తరలి పోయిందన్నారు. బండి సంజయ్ సన్యాసం పుచ్చుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. బీజేపీ పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై ఖర్చుల భారాన్ని మోపిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఎంపీగా ఆ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలిపడం చూస్తేనే కాంగ్రెస్, బీజేపీ ఒకటే అనే విషయం అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని…డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేయలేదని…కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు గమనించారని..పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పబోతున్నార‌ని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఒక్క సారి ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో బీఆరెస్‌ జిల్లా అధ్యక్షుడు జీవి.రామకృష్ణ రావు,సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీచైర్మన్ సర్దార్ రవిందర్ సింగ్ త‌దితరులు పాల్గొన్నారు.

Exit mobile version