విధాత: త్వరలోని నీవు చనిపోతావంటూ ఓ జ్యోతిష్యుడి మాటలకు ప్రభావితమైన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వైరల్ గా మారింది. బెంగళూరు-యశ్వంతపురలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న విద్యాజ్యోతి(29) ఇటీవల ప్రేమించిన యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విద్యాజ్యోతి తన వైవాహిక జీవితం మంచిగా కొనసాగాలన్న కోరికతో ఇటీవల ఓ జ్యోతిష్యుడిని కలవగా..నీవు ఎక్కువ కాలం బతకలేవు అంటూ అతను భయపెట్టే మాటలు చెప్పాడు.
తొమ్మిది రోజులు పూజలు చేసి, చివరి రోజు శుక్రవారం తాళి తీసి అమ్మవారికి సమర్పించినట్లయితే నీకు అన్ని కష్టాలు తొలగిపోతాయని అంతా మంచే జరుగుతుందని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు. ఈ క్రమంలో తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి, చివరి రోజు తాళి తీయడానికి గదిలోకి వెళ్లిన విద్యాజ్యోతి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకున్నఆత్మహత్యకు పాల్పడింది.
రాత్రి భోజనం తర్వాత తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేస్తే ఎంతకు ఫోన్ తీయకపోవడంతో ఇంటికి వెళ్లారు. తలుపులు పగులగొట్టి చూడగా..ఆమె ఉరి వేసుకుని చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న బాగలగుంటే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. ఆమె మరణానానికి దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కొన్ని సంవత్సరాల క్రితం ఎంబీఏ పూర్తి చేసి హోసూర్ రోడ్డులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఎంఈఐ లేఅవుట్ నివాసం ఉంటుందని తెలిపారు.
