అమరావతి : కేరళను కేరళం అని మార్చినట్లే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం పేరును కూడా ‘తెలుగునాడు’ (Telugunadu) గా మార్చాలని(rename) ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు( Garikipati Narasimha Rao) డిమాండ్ చేశారు. ఏపీలోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలలో గరికపాటి మాట్లాడారు.
‘ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదు అని, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ఎలానో ఆంధ్రప్రదేశ్ కూడా అంతేనని స్పష్టం చేశారు. తెలుగుదనం మన రాష్ట్రం పేరులో లేదు అని, మాజీ సీఎం ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ను తెలుగునాడు అని మార్చేందుకు నానా ప్రయత్నాలు చేశారన్నారు. ఎన్టీఆర్ ఆశయం మేరకు తమిళనాడులాగే తెలుగునాడు అని మార్చిన రోజునే ఖచ్చితంగా మన జాతి, భాషాలకు గుర్తింపు దక్కుతుందన్నారు. ఒక్క సున్న కోసం మా భాష, మా రాష్ట్రం అని కేరళ వాళ్లు పట్టుదలతో కేరళం పేరు సాధించారన్నారు. అటువంటి పట్టుదల మనలోనూ ఉంటే రాష్ట్రం పేరుతో పాటు మన బతుకులు కూడా మారుతాయి’ అని గరికపాటి చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు పూర్తిగా ఆంగ్ల భాషను రద్దు చేయాలని, బోధన అంతా తెలుగులోనే సాగాలని, ఈ మేరకు చట్టం చేయాలని కోరారు.
సభలో మాట్లాడిన భాషా పండితులు, ప్రజాప్రతిధులు, వక్తలు ప్రాథమిక విద్య మాతృ భాషలోనే సాగాలని కోరారు. డిగ్రీ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేయాలని తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానాలు చేశారు. ఈ మహాసభలలో గవర్నర్ కంభంపాటి హరిబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, 20సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్ తులసీరెడ్డి, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర్ రావు, ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్, సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి తదితరులు ప్రసంగించారు.
