స్థానికులకు ఉద్యోగమివ్వకుంటే ప్రారంభాన్ని అడ్డుకుంటాం : హరీష్ రావు

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 70% ఉద్యోగాలు ఇవ్వకుంటే ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరిక. భూ భారతి పై కూడా తీవ్ర ఆరోపణలు.

Harish Rao

విధాత, ప్రత్యేక ప్రతినిధి: కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 70శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర మంత్రులు ప్రారంభోత్సవానికి వస్తే బిడ్డా మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు హెచ్చరించారు. మహారాష్ట్రలోని లాతూర్ వ్యాగన్ ఫ్యాక్టరీలో 70 శాతం స్థానికులకే రిజర్వేషన్ ఇచ్చారని, మరి తెలంగాణలో మన కాజీపేట యువతీ యువకులకు ఎందుకు ఆ రిజర్వేషన్ కల్పించడం లేదంటూ ప్రశ్నించారు. మహారాష్ట్రకు ఒక చట్టం, తెలంగాణకు ఒక చట్టం ఉంటుందా? అంటూ నిలదీశారు. కొలువుల కోసం కొట్లాట పేరుతో హన్మకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ నాయకత్వంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు బీజేపీకి 8 మంది, కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలను గెలిపిస్తే వాళ్లు తెలంగాణకు చేస్తున్న నిర్వాకం ఇదేనా? స్థానిక ఎంపీ స్థానికుల ఉద్యోగాల గురించి ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. ఫ్యాక్టరీ వచ్చినా.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ఇక్కడ కడుతున్నది వ్యాగన్ ఫ్యాక్టరీనా? లేక కోచ్ ఫ్యాక్టరీనా? దీనిపై స్పష్టతనిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేట జంక్షన్ ప్రాధాన్యత రోజురోజుకూ తగ్గిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంకు రైల్వే జోన్ ఇచ్చినట్లుగానే, కాజీపేటను కూడా తక్షణమే రైల్వే జోన్ గా ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలి శాసనసభాపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది సుదర్శన్ రెడ్డి,తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, శంకర్నాయక్, మర్రి యాదవరెడ్డి, డాక్టర్ హరి రమాదేవి, నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

భూ భారతి కాదు…భూ హరతి

కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో తెచ్చింది భూ భారతి కాదని, భూ హారతి అంటూ హరీష్ రావు విమర్శించారు. జనగామలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూ భారతి స్కామ్ మీద వెంటనే సిట్ వేయాలన్నారు. తన శాఖలో ఇంత అవినీతి జరుగుతుంటే తుస్సు బాంబుల మంత్రి, ఒళ్లంతా అహంకారం నిండిన మంత్రి పొంగులేటి ఎందుకు స్పందిస్తలేడని ప్రశ్నించారు. 35 మండలాల్లో కాంగ్రెస్ సర్కార్ భూ భారతి పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. దీని వెనుక ఉన్న కాంగ్రెస్ నాయకులు, అధికారులు బయటకురాకుండా నామ మాత్రంగా విచారణ చేస్తున్నారని అన్నారు. కేసులు నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఖజానాకు గండికొడుతూ భూ హారతి పడుతోందన్నారు. ఈ కుంభకోణంపై రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదు? పొంగులేటి అంటే భయమా? అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

మన దేశంలోని ఈ గుడిలో నూడిల్స్, మొమోస్, పిజ్జా ప్రసాదంగా ఇస్తారు.. ఎందుకంటే?
Iran Israel War : ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు..24మంది విద్యార్ధుల మృతి

Latest News