వెధవ అంటే వెయ్యేళ్లు వర్ధిల్లు అన్నట్లే

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వెధవ అంటూ దూషిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు

  • Publish Date - April 27, 2024 / 08:16 PM IST

*పొన్నం తిట్లను దీవెనలుగా భావిస్తా

*ఓటుకు వెయ్యి ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ యత్నం

*బోయినిపల్లిలో లూటీ చేసిన కుటుంబం పరారీలో ఉంది.

*కేసీఆర్ కు దోచిపెట్టడం తప్ప.. కుటుంబానికి దాచిపెట్టడం తప్ప చేసిందేమీ లేదు.

*కేసీఆర్ అనే నాణేనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు బొమ్మ, బొరుసులాంటోళ్లు

*చీకటి ఒప్పందాలతో నన్ను ఓడించాలని కుట్ర చేస్తున్నరు.

*బోయినిపల్లి పన్నా ప్రముఖ్‌ల‌ భేటీలో బండి సంజయ్ వ్యాఖ్యలు

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వెధవ అంటూ దూషిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పొన్నం తిట్లు దీవెనలుగా భావిస్తున్నానని చెప్పారు. పొన్నం వెధవ అంటే తన దృష్టిలో ‘వెయ్యేళ్లు వర్ధిల్లు’’ అని అర్ధమని చెప్పారు. ఓడిపోతామని తెలిసి ఓటుకు రూ.వెయ్యి ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ అభ్యర్ధి యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాలతోపాటు, గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన ద్రోహాన్ని వివరించి బీజేపీకి ఓటేయించాలని కోరారు.పార్టీ పన్నా ప్రముఖ్ లు పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఇంటికీ 5 సార్లు వెళ్లి ఓట్లు అభ్యర్ధించడంతోపాటు తమ పోలింగ్ బూత్ పరిధిలో 100 శాతం పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. నూటికి నూరుశాతం ఓట్లు వేయించే పోలింగ్ బూత్ బాధ్యులను తాను స్వయంగా అభినందించడంతోపాటు సన్మానిస్తానని చెప్పారు. శనివారం బోయినిపల్లి మండలానికి వచ్చిన బండి సంజయ్ మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభతో కలిసి పార్టీ పన్నా ప్రముఖుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

దేశమంతా నరేంద్రమోదీ గాలి వీస్తున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలంతా తమ తమ పోలింగ్ బూత్ ల పరిధిలోని తటస్థ ఓటర్లతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి ఓట్లు అభ్యర్ధించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ఎన్నికల నాటికి ప్రతి కార్యకర్త ఇంటింటికీ మూడు సార్లు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయాలని సూచించారు.

మొన్నటి దాకా బోయినిపల్లిలో ఒక కుటుంబం అరాచకంగా వ్యవహరించిందని, కొందరు పోలీసులు వారికి వత్తాసు పలికారని, ప్రస్తుతం ఆ కుటుంబం పరారీలో ఉందని, వారికి వత్తాసు పలికిన పోలీసుల పరిస్థితి ఇబ్బంది కరంగా తయారైంది అన్నారు. బైంసాలో హిందువులపై దారుణాలు జరిగినా ఎవరూ పట్టించుకోలేదు, చెంగిచర్లలో గర్భవతులపై, చిన్నారులపైనా దాడులు చేశారని తెలిపారు.

ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఘోరంగా ఓటమి పాలుకాబోతున్నయని, ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మోదీపట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కసుతో తనను వెధవ, రండ అంటూ బూతులు తిడుతున్నారని, అయితే ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు. ఆయన వద్దకు పోవాలంటేనే ఆ పార్టీ కార్యకర్తలు భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు.

Latest News