విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగర వాసులను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి. సోమవారం సాయంత్రం పడిన కుండపోత వానకు నగరంలోని రోడ్లు వాగులను తలపించాయి. రోడ్లపై వరద నీటితో కీలో మీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించిపోగా…వాహనదారులు ఓవైపు వర్షం..ఇంకోవైపు ట్రాఫిక్ జామ్ తో నానాపాట్లు పడ్డారు. అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఫిలింనగర్, ట్యాంక్ బండ్, బషీర్ బాగ్, సోమాజిగూడ, ఖైరతాబాద్, నాంపల్లి, లకిడికపూల్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. యూసఫ్ గూడా, సనత్ నగర్, కృష్ణ నగర్, అంబర్ పేట్, అబ్దుల్లా పూర్ మెట్, ఎల్బీనగర్, హయత్ నగర్, ఇటు తార్నాకా, సికింద్రాబాద్, మెట్టుగూడ, ఉప్పల్, మేడిపల్లి ప్రాంతాలను కుండపోత వానాలు జలమయంగా మార్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలతో పాటు దాదాపుగా అన్ని ప్రాంతాలు వరద నీటి ముంపుకు గురయ్యాయి.
హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్ లో పడుతున్న వర్షాలు సోమవారం రాత్రి వరకు కొనసాగుతాయని ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హైడ్రా హెచ్చరించింది. హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని హైడ్రా హెచ్చరించింది. ఆఫీసుల నుంచి ఉద్యోగులు సాయంత్రం ఒక్కసారిగా బయటకు రావద్దని తెలిపింది. వరద ప్రాంతాల్లో డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొంది.