Global Warming Threat | మానవ చర్యల కారణంగా పర్యావరణ అనునిత్యం ప్రమాదానికి గురవుతూనే ఉన్నది. ఇదేదో పర్యావరణం ఎదుర్కొనే కష్టం అని ఊరుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అంతిమంగా ఆ ప్రమాదాలు ప్రభావం చూపేది మానవాళిపైనే. ఇప్పుడు తాజాగా అటువంటి హెచ్చరిక ఒకటి శాస్త్రవేత్తల నుంచి వచ్చింది. హిమానీనదాలు లేదా మంచుఫలకలు కరిగిపోవడం వల్ల సముద్రజల మట్టాలు పెరుగుతాయని, సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అందరికీ తెలిసిందే. అయితే.. శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని చెబుతున్నారు. హిమానీనదాలు పెద్ద మొత్తంలో కరగడం వల్ల పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ నిద్రాణంగా ఉన్న వందల కొద్దీ అగ్నిపర్వతాలను ఈ పరిణామాలు మేల్కొలుపుతాయని అంటున్నారు. ఇది ఇప్పటికే తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్న పర్యావరణానికి కొత్త సవాలుగా పరిణమిస్తుందని, పర్యావరణ మార్పులను మరింత ప్రభావితం చేస్తాయని అంటున్నారు.
పటగోనియా హిమానీనదాల కింద ఉన్న శిలాద్రవం (మాగ్మా)లో మార్పులను శాస్త్రవేత్తలు ఇటీవల అంచనా వేశారు. ఆ అంచనా నమూనాల ప్రకారం.. భారీ స్థాయిలో హిమానీనదాలు కరగడంతో అనేక అగ్నిపర్వతాలను నిద్రాణ స్థితి నుంచి మేల్కొలిపే అవకాశం ఉందని వెల్లడైంది. అగ్నిపర్వతాలు విస్పోటం చెందే పరిస్థితి తక్షణం లేకపోయినా.. వేగంగా కరుగుతున్న మంచు ఫలకలు భవిష్యత్తులో అగ్నిపర్వతాల విస్పోటాల ప్రమాదాన్ని సూచిస్తున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. దానర్ధం.. మనకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ.. మన భావి తరాలు మాత్రం మనం చేసిన పాపాలకు పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుందన్నమాట. అదికూడా వందల సంవత్సరాల తర్వాతో, వేల సంవత్సరాల తర్వాతో జరిగే పరిణామం కాదని, కొన్ని ఏళ్లలోనే సంభవించే ప్రమాదం ఉన్నదన్న శాస్త్రవేత్తలు ప్రమాదాలు ఎదుర్కొనేందుకు, వాటిని ముందుగానే నివారించేందుకు సిద్ధంగా ఉండటం ఎల్లప్పుడూ మంచిదేనని చెబుతున్నారు. హిమానీనదాలు కరిగే కారణంగా ప్రత్యేకించి అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో వందకుపైగా అగ్నిపర్వతాలు (ప్రస్తుతం భారీగా మంచు కప్పేసి ఉన్నాయి) విస్ఫోటం చెందే ప్రమాదాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
పటగోనియా మంచు ఫలకాల లోతైన చరిత్ర ఆధారంగా ఈ అధ్యయాన్ని సాగింది. ఈ ఫలకం 18వేల ఏళ్ల క్రితం భారీ పరిణామంలో ఉన్న సమయంలో మొత్తం దక్షిణ అమెరికాను కప్పేసి ఉన్నది. దీని అడుగున 10 నుంచి 15 కిలోమీటర్ల మేర మాగ్మా పేరుకుపోయి.. ఘనీభవించిపోయి ఉన్నది. అయితే.. వాతావరణం వేడెక్కి, గ్లేసియర్లు కరిగిపోతే.. అగ్నిపర్వతాలపై ఒత్తిడి తగ్గిపోతుంది. అగ్నిపర్వతాలపై భారం తగ్గిపోవడంతో భూమి క్రస్ట్ పైకి ఉబికి వస్తుంది. దీంతో మాగ్మా అంతర్భాగంలో ఉన్న వాయువులు వ్యాకోచం చెందుతాయి. ఇది అగ్నిపర్వతాల విస్ఫోటానికి దారి తీస్తుంది.
చిలీలోని ఆరు అగ్నిపర్వతాల నుంచి నమూనాలను సేకరించిన శాస్త్రవేత్తలు.. వాటి గత విస్పోటాల చరిత్రను అధ్యయనం చేశారు. అందులో ఒకటి.. మోఖో ఖోశుయెంకో అగ్నిపర్వతం. ఇప్పుడు ఇది నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ.. గతంలో పటాగోనియా ఐస్ తొలగిపోవడంతో విస్పోటం చెందినదని గుర్తించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు కొనసాగితే.. ఈ ప్రాంతంలో మంచు ఫలకలు కరిగిపోవడానికి మూడు నుంచి 5వేల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈలోపు ఆ పరిణామానికి సిద్ధమయ్యేందుకు తగినంత సమయం ఉందని చెబుతున్నారు. అగ్నిపర్వతాలు విస్పోటం చెందకుండా వాటిపై కప్పేసిన గ్లేసియ నిరోధిస్తుంటాయని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన అగ్నిపర్వత శాస్త్రవేత్త పాబ్లో మోరెనో-యేగర్ గోల్డ్‌స్చ్మిడ్ట్ సమావేశంలో సమర్పించిన పరిశోధన పత్రంలో వివరించారు. వాతావఱణ మార్పుల కారణంగా గ్లేసియర్లు కరిగిపోతున్న కారణంగా ఈ అగ్నిపర్వతాలు మరింత తరచూగా, శక్తిమంతంగా విస్ఫోటం చెందే అవకాశాలు ఉన్నాయని తమ పరిశోధనలు సూచిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉత్తర అమెరికా, న్యూజీలాండ్, రష్యా వంటి ప్రాంతాల్లోని మంచుతో కప్పబడిన అగ్నిపర్వతాలపై ఇప్పుడు శాస్త్రవేత్తలు దృష్టిసారించారు.
ఇవి కూడా చదవండి..
Environment | విధ్వంసం ఎవరిది.. వినాశనం ఎవరికి?
World Environment Day | ‘పర్యావరణం’పై యుద్ధం..! ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతూనే ఉన్న గాజానే ఉదాహరణ..!!
Penguins | అంటార్కిటికాలో మంచు ఫలకాల కొరత.. వేల పెంగ్విన్లు మృత్యువాత
Climate change | మరో పదిహేనేళ్లలోనే ఆ సిటీల్లో జీవనం అసాధ్యం! ఇండియాలో ఆ సిటీలు కూడా?