Environment | విధ్వంసం ఎవ‌రిది.. వినాశ‌నం ఎవ‌రికి?

Environment ఆధిపత్య కమ్యూనిటీ వల్లే పర్యావరణ క్షీణత ద‌ళిత‌, పేద‌వ‌ర్గాల‌పై ఆ మార్పుల ప్రభావం ఇటీవ‌ల వ‌డ‌దెబ్బ మ‌ర‌ణాలు దీనికి సంకేతం ఇలాగైతే బడుగుల భవిష్యత్తు మరింత దుర్లభం కొత్త అధ్యయనాల్లో భయంకర గణాంకాలు న్యూఢిల్లీ: భూమి, నీరు, అడవులు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం ఇవన్నీ ప్రకృతిలో భాగమే. సహజ వనరులే. అయితే భూమిపై లభించే ఈ వనరుల‌ను అధికంగా వినియోగించుకొని ల‌బ్ధి పొందుతున్న వ‌ర్గాల వారెవ‌రు? లాభాలు ఆర్జిస్తూ సుఖాలు అనుభ‌విస్తున్నదెవరు? ప్ర‌కృతి, స‌హ‌జ వ‌న‌రుల‌ […]

  • Publish Date - June 28, 2023 / 12:32 AM IST

Environment

  • ఆధిపత్య కమ్యూనిటీ వల్లే పర్యావరణ క్షీణత
  • ద‌ళిత‌, పేద‌వ‌ర్గాల‌పై ఆ మార్పుల ప్రభావం
  • ఇటీవ‌ల వ‌డ‌దెబ్బ మ‌ర‌ణాలు దీనికి సంకేతం
  • ఇలాగైతే బడుగుల భవిష్యత్తు మరింత దుర్లభం
  • కొత్త అధ్యయనాల్లో భయంకర గణాంకాలు

న్యూఢిల్లీ: భూమి, నీరు, అడవులు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం ఇవన్నీ ప్రకృతిలో భాగమే. సహజ వనరులే. అయితే భూమిపై లభించే ఈ వనరుల‌ను అధికంగా వినియోగించుకొని ల‌బ్ధి పొందుతున్న వ‌ర్గాల వారెవ‌రు? లాభాలు ఆర్జిస్తూ సుఖాలు అనుభ‌విస్తున్నదెవరు? ప్ర‌కృతి, స‌హ‌జ వ‌న‌రుల‌ విధ్వంసానికి కార‌కులెవ‌రు? కర్బన ఉద్గారాల ఉత్ప‌త్తికి, ప్ర‌కృతి వైప‌రీత్యాల‌కు, వాతావరణ తీవ్ర మార్పుల‌కు అధికంగా కార‌ణ‌మ‌వుతున్న‌ది ఎవ‌రు? ఆధిపత్య కమ్యూనిటీలు పర్యావరణ క్షీణతకు భారీగా దోహదపడుతుండ‌గా, అట్టడుగున ఉన్న ద‌ళిత‌, గిరిజ‌న, సామాన్య‌ పేద‌వ‌ర్గాలు వాతావరణ మార్పుల ప్రభావానికి గుర‌వుతున్నారు. ఇదే విష‌యాన్ని ఇటీవ‌లి అధ్య‌య‌నాలు రుజువు చేస్తున్నాయి.

ఇటీవ‌ల వ‌డ‌గాలుల‌కు 140 మంది మృతి

ఇటీవల ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో వేడిగాలుల కారణంగా 140 మందికి పైగా మరణించారు. ఈ మరణాలు యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. దేశంలో వేడిగాలులు ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా అవి మరింత తీవ్రంగా, భరించలేనివిగా మారాయి. ఉష్ణోగ్రతలు 45-47 డిగ్రీల మధ్య పెరగడంతో యూపీలో వంద మంది, బీహార్‌లో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఎండలూ మార్పుకు సంకేతాలే

వాతావరణం త‌న‌ మార్పుల‌ను, సంకేతాలను వివిధ రూపాల్లో చూపిస్తుంది. అకాల వర్షాలు, వరదలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు ఇందులో భాగ‌మే. ఇవి ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఆ ప్ర‌భావం అంద‌రిపై ఒకేలా ఉండ‌దు. ఒక‌రిపై ఎక్కువ‌, మ‌రొక‌రిపై త‌క్కువ ప్ర‌భావం ఉంటుంది. అదెలాగా అంట‌రా? అయితే ఒక‌సారి దేశంలోని వివిధ మాన‌వ స‌మాజాల‌ను ప‌రిశీలించాల్సి ఉంటుంది.

దళిత‌, గిరిజనులు ప్రకృతితో మ‌మేక‌మ‌వుతారు. ప్రకృతితో విడదీయరాని అనుబంధం కలిగి ఉంటారు. దానిపై ఆధారపడతారు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వారు తీవ్రంగా దెబ్బతింటారు. అనేకమంది దళిత రచయితలు తమ ఆత్మకథల్లో ఈ విష‌యాన్ని వివ‌రించారు. తమిళంలో బామ రాసిన ‘కరక్కు’ పుస్త‌కం దళితుల జీవితంలోని ప్రతి అంశం ప్రకృతితో ఎలా ముడిపడి ఉందో వెల్ల‌డిస్తున్న‌ది.

“శ్రమించే వారు, కూర్చుని విందు ఆర‌గించేవారుగా మన సమాజం విభజించబడింది. ప్రకృతి వనరులను అగ్రవర్ణాల వారికి కేటాయించారు. ప్రకృతి ఆగ్రహం మాత్రం అట్టడుగు కులాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న‌ది అని ఓం ప్రకాశ్ వాల్మీకి అనే ర‌చ‌యిత‌ పేర్కొన్నారు.

2021లో లండన్‌కు చెందిన థింక్ ట్యాంక్ ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ చేసిన అధ్యయనం ప్రకారం.. వేడిగాలులు ఇటీవ‌ల తీవ్రంగా మారుతున్నాయి. చాలా నగరాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. 1950 నుంచి భారీ వర్షాల ఘటనలు మూడు రెట్లు పెరిగాయి.

భారతదేశంలో ప్రస్తుతం ఒక బిలియన్ ప్రజలు ఏడాది కనీసం నెలపాటు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. దేశ జనాభాలో మూడోవంతు తీరప్రాంతంలో నివసిస్తున్నందున సముద్ర మట్టాలు పెరగడం కూడా ప్రమాదాలను సృష్టిస్తున్న‌ది. ఉత్తర హిందూ మహాసముద్రం రెండు దశాబ్దాలుగా సంవత్సరానికి సగటున 3.2 మిల్లీమీట‌ర్లు పెరిగింది.

వాతావరణ మార్పుల వల్ల అట్టడుగు వ‌ర్గాల వారు ఏ మేరకు ప్రభావితం అవుతున్నారో కూడా ఆ సంస్థ నివేదిక వెల్ల‌డించింది. నిరంతర ఉష్ణోగ్రతలు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో పనిచేసేవారిపై, గాలి సరిగా లేని ఇండ్ల‌లో నివసించే వారిపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతాయి. వరదలు, తుఫానులు, తక్కువ-ఆదాయ కమ్యూనిటీల్లో అత్యంత వినాశనాన్ని కలిగిస్తాయి.

క్షీణిస్తున్న వ్యవసాయ ఉత్పాదకత, పెరుగుతున్న తృణధాన్యాల ధరలు 2040 నాటికి భారతదేశ జాతీయ పేదరికం రేటును 3.5 శాతం పెంచుతుంది. దీని అర్థం అదనంగా 50 మిలియన్ల మంది పేదలు పెరుగుతారు.

గ్రామీణ మహిళలపై తీవ్ర ప్రభావం

వేడిగాలులు గ్రామీణ‌, పేద‌ మహిళలు, యువతులను ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటిని దూర‌ప్రాంతాల నుంచి తీసుకువ‌చ్చేది మ‌హిళ‌లే. వ్యవసాయ కూలీలు చాలా వ‌డ‌గాడ్పుల‌ను భ‌రించాల్సి ఉంటుంది. వేడిని త‌గ్గించ‌డానికి వారికి వనరులు లేవు. పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారులు వేస‌విలో ఎండ‌ల‌కు, వాన‌ల‌కు దుర్భ‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు.

ప్ర‌స్తుత వాతావరణ మార్పుల కారణంగా నీటి వనరులు కలుషితమవుతున్నాయి. స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత ఏర్ప‌డుతున్న‌ది. ప్రకృతిపై నేరుగా ఆధారపడిన సమాజాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతున్న‌ది. జార్ఖండ్ ప్రాంతంలో, నిరంతర మైనింగ్ కారణంగా, సమీపంలో నివసిస్తున్న గిరిజన ప్రజల జీవితాలు ఘోరంగా మారాయి. నీరు తాగలేని స్థితికి చేరుకున్న‌ది. నేల, దుమ్ముతో నిండిపోయి సాగుకు ప‌నికి రాకుండా మారింది. ఇత‌ర‌ అనేక ఇతర సమస్యలు కూడా వారిని వేధిస్తున్నాయి.

పర్యావరణాన్ని కలుషితానికి కార‌కులెవ‌రు?

మొత్తానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటున్న‌ది. అయితే, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యానికి కార‌కులెవ‌రు? పారిశ్రామిక వేత్త‌లు, వ్యాపార‌వేత్త‌లు.. కర్బన ఉద్గారాల‌ను వాతావ‌ర‌ణంలో విచ్చిల‌విడిగా వదిలి ప్ర‌కృతిని కాలుష్య కాసారంగా మార్చే ప్ర‌తిఒక్క‌రూ ఇందుకు బాధ్యులే. పర్యావరణ క్షీణతకు భారీగా దోహదపడే ఆధిపత్య కమ్యూనిటీలు.

నిబంధ‌న‌లు పాటించ‌కుండా పరిశ్ర‌మ‌లు, కంపెనీలు, సంస్థ‌లు నిర్వహిస్తూ ప‌ర్యావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీసే ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌జ‌వ‌న‌రుల విధ్వంసానికి కార‌కులే. ప్ర‌కృతి వైప‌రీత్యాల కార‌ణంగా అసువులు బాసే పేద‌ల బతుకుల‌కు బాధ్యులే.

Latest News