Tamil Nadu palm tree initiative|దేశంలో సగం తాటిచెట్లు…తమిళనాడులోనే!

తమిళనాడు ప్రభుత్వం తాజాగా తాటిచెట్ల పెంపకం కోసం చేపట్టిన గ్రీన్ తమిళనాడు కార్యక్రమంంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల 24 లక్షల (22.4 మిలియన్లు) తాటి విత్తనాలను విజయవంతంగా నాటి రికార్డు సృష్టించారు. భారత దేశ వ్యాప్తంగా 100మిలియన్లకు పైగా తాటిచెట్లు ఉంటే.. ప్రస్తుతం ఒక్క తమిళనాడులో తాటిచెట్ల సంఖ్య 51.9 మిలియన్లకు పైగానే ఉందని అధికారిక సమాచారం. ఇది భారతదేశంలోని తాటిచెట్ల సంఖ్యలో దాదాపు సగం కావడం విశేషం.

విధాత: భారత ప్రజలకు తాటి చెట్టు (Borassus flabellifer)కు తరాల బంధం. తాటి చెట్టును, దాని ఆకులు, ఫలాలను ప్రజలు ఎన్ని రకాలుగా వాడుతారో తెలిసిందే. అయితే రియల్ ఎస్టేట్ పుణ్యమా అని..పెరుగుతున్న జనావాసాల కారణంగా తెలంగాణ వంటి రాష్ట్రాలలో పెద్ద ఎత్తున తాటిచెట్ల(palm tree) తొలగింపు కొనసాగుతుంది. అందుకు భిన్నంగా దేశంలోని ఓ రాష్ట్రం మాత్రం తాటిచెట్టును తల్లిగా భావిస్తూ దాని సంరక్షణ యజ్ఞం చేపట్టింది. తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం తన రాష్ట్ర వృక్షంగా తాటిచెట్టు(బోరాసస్ ఫ్లాబెలిఫర్)ను ప్రకటించకోవడమే కాకుండా..సముద్రపు తుపాన్లు, తీర ప్రాంత కోతలు, వరదల ముప్పును అడ్డుకోవడంలో తాటిచెట్టు ప్రాధాన్యతను గ్రహించి తాటిచెట్ల సంఖ్యను పెంచుతూ వెలుతుంది. తమిళనాడు ప్రభుత్వం తాజాగా తాటిచెట్ల పెంపకం కోసం చేపట్టిన గ్రీన్ తమిళనాడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా  2 కోట్ల 24 లక్షల (22.4 మిలియన్లు) తాటి విత్తనాలను విజయవంతంగా నాటి రికార్డు సృష్టించారు.

తాటి విత్తనాల నాటడంలొ తమిళనాడు కొత్త రికార్డు

గత సెప్టెంబర్‌లో ప్రారంభించబడిన తాటి మొక్కల పెంపకం ప్రాజెక్టు ప్రారంభ లక్ష్యం 60 మిలియన్ తాటి విత్తనాలను నాటడం. అయితే అక్టోబర్ నెలాఖరు నాటికి 7.2మిలియన్ల  విత్తనాలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందనతో డిసెంబర్ ప్రారంభం నాటికి 22.4 మిలియన్ విత్తనాలు నాటడం పూర్తి చేసినట్లుగా తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 16,600 మందికి పైగా వాలంటీర్లు తాటిచెట్ల నాటివేత కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాటిన అన్ని విత్తనాలను జియో-ట్యాగ్ చేసి మొబైల్ యాప్ ద్వారా ట్రాక్ చేస్తారు. నదీ తీరాలు, వ్యవసాయ భూములు, ప్రభుత్వ స్థలాలతో సహా వివిధ ప్రాంతాలలో మొక్కలు నాటే పని ముమ్మరంగా కొనసాగించారు. విద్యార్థి సంస్థలు, ఎన్జీవోలు సాధారణ ప్రజలతో సహా అన్ని పార్టీల నుండి స్వచ్చందంగా సహకారం లభించడంతో తాటిచెట్ల పెంపకం కార్యక్రమం విజయవంతమైంది. పెరంబూదుర్, తిరుచిరాపల్లి, పుదుక్కోట్టై, అరియలూర్, తిరుపత్తూర్, శివగంగై,సేలం, నాగపట్నం వంటి జిల్లాలలో 10 లక్షల చొప్పున విత్తనాలను నాటడం విశేషం.

దేశంలోని సగం తాటిచెట్లు తమిళనాడులోనే

తమిళనాడు ప్రభుత్వం తాటిచెట్ల పెంపకానికి చేపట్టిన కార్యక్రమాల ద్వారా ఆ రాష్ట్రంలో తాటిచెట్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. భారత దేశ వ్యాప్తంగా 100మిలియన్లకు పైగా తాటిచెట్లు ఉంటే.. ప్రస్తుతం ఒక్క తమిళనాడులో తాటిచెట్ల సంఖ్య 51.9 మిలియన్లకు పైగానే ఉందని అధికారిక సమాచారం. ఇది భారతదేశంలోని తాటిచెట్ల సంఖ్యలో దాదాపు సగం కావడం విశేషం. తమిళనాడు తాటిచెట్ల కోటగా మారిపోయింది. 120 సంవత్సరాలకు పైగా జీవించగల తాటి చెట్టు నేల కోతను నివారిస్తుంది. భూగర్బ నీటి వనరులను సంరక్షిస్తుంది. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం మరో ప్రత్యేకత. ఇది నుగ్గు, పడనీర్, కరుపట్టి, తాటి ఆకు ఉత్పత్తులు వంటి అనేక జీవనోపాధి అవకాశాలను కూడా అందిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సహజ వనరులు, జీవ వైవిధ్య పరిరక్షణలో సాంప్రదాయ తాటి చెట్ల పెంపకం, పరిరక్షణ కీలక పాత్ర పోషిస్తుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

తాటి ఉత్పత్తులతో ఉపాధి..భద్రత

తాటి చెట్టు కాండం భాగాలను గ్రామీణులు ఇంటి నిర్మాణంలో పైకప్పు దూలాలుగా వాడుతుంటారు. తాటి కమ్మలను పై కప్పులుగా వాడుతారు. తాటి కమ్మలతో పలు రకాల అల్లికల వస్తువులు, బొమ్మలను తయారు చేసి విక్రయిస్తుంటారు. పూర్వకాలంలో తాటి ఆకులను సమాచారం రాసే కాగితాలుగా కూడా వినియోగించారు. మహా కావ్యాలు సైతం తాటి కమ్మలపైన రాయబడటం విశేషం. తాటి లేత ఫలాలు(ముంజలు,ఐస్ ఆపిల్) ప్రజలకు వేసవిలో తినడం ఎంతో ఆరోగ్యకరం. తాటి పండ్లు సైతం ఆరోగ్యానికి మంచివి. తాటి పండ్లను భూమిలో వేసి గేగులు(పీకలు)గా మార్చి తింటుంటారు. మలబద్దకం వంటి వారికి ఇవి ఎంతో మంచివని చెబుతారు. ఇక తాటి కల్లు, నీరా సేవనం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. నీరాను అనేక ఉత్పత్తులో వాడుతారు. కల్లు, నీరా అమ్మకాలతో లక్షల మంది గీత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. తాటి బెల్లంను కూడా అనేక ఉత్పత్తులలో వాడుతారు. తాటి ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఎంతో మంది జీవనోపాధి పొందుతుండటం విశేషం. తెలంగాణ వంటి రాష్ట్రాలలో కొత్తతరం యువత గీత వృత్తికి ఆసక్తి చూపకపోతుండటంతో తాటిచెట్ల అవశ్యకతకు ముప్పుగా మారింది.

 

Latest News