విధాత: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు చిత్రవిచిత్ర అంశాలకు వేదికవుతున్నాయి. ఓ గ్రామంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవ ఎన్నిక ప్రయత్నం బెడిసికొట్టి గ్రామస్తులను కేసుల పాలు చేసింది. సిద్దిపేట జిల్లా పాండవపురం గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం చేసే క్రమంలో చట్ట విరుద్దంగా వ్యవహరించారన్న ఆరోపణలో ఏకగ్రీవ వేలానికి పాల్పడిన 35 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సర్పంచ్ పదవికి గ్రామస్తులు వేలం పాట పెట్టగా..అందె శంకరయ్య అనే వ్యక్తి 16 లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. ఊరిలో ఎవరూ నామినేషన్ వేయొద్దని నిబంధన విధించారు. అయితే బైరి రాజు అనే వ్యక్తి అందుకు మొదట ఒప్పుకుని తర్వాత నామినేషన్ వేయడంతో గ్రామస్తులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరి రాజును కుల బహిష్కరణ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైరి రాజును వేధించడం, ఎన్నికల చట్టాలకు వ్యతిరేకంగా సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించడంపై 35మంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు.
ఆ గ్రామ సర్పంచ్ పదవి ఖరీదు రూ.55 లక్షలు
రంగారెడ్డి జిల్లాలోని బ్రాహ్మణపల్లిలో సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించారు. సర్పంచ్ పదవిని ఓ యువకుడు రూ.55 లక్షలకు కొనుగోలు చేశాడు. మొత్తం ముగ్గురు పోటీ పడగా.. రూ.55 లక్షలకి సర్పంచ్ పదవి దక్కించుకున్నాడు. సర్పంచ్ పదవి ఏకగ్రీవం కోసమే ఈ వేలంపాట నిర్వహించినట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఒకవేళ ఈ వేలంపాట అతిక్రమించి ఎవరైన నామినేషన్ వేస్తే.. రూ.1 కోటి చెల్లించాలంటూ కండీషన్ పెట్టారు.
ఇవి కూడా చదవండి :
NH66 Collapses In Kerala : కుంగిన జాతీయ రహదారి.. ఇరుక్కపోయిన వాహనాలు
ఇండిగో బాధిత ప్రయాణికులకు రైల్వే, ఆర్టీసీ బాసట!
