Revanth Reddy : వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి

బీఆర్ఎస్ మళ్లీ వస్తే మంచి రోజులు కాదు ముంచే రోజులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండ సభలో కేసీఆర్ పై విమర్శలు. పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

Revanth Reddy

విధాత : ప్రజా తిరస్కరణకు గురై ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని..మంచి రోజులొస్తాయని పగటి కలలు కంటున్నాడని..మళ్లీ వాళ్లు వస్తే..మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దేవరకొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కలవని పరిస్థితి ఉండేదని..పాపం ఇప్పుడు ఇద్దరు సర్పంచ్ లు, నలుగురు వార్డు మెంబర్లను పిలిపించుకుని మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాబందుల మాదిరిగా పదేళ్లు తెలంగాణను దోచుకున్నా కేసీఆర్ కుటుంబానికి ఇంకా ఆకలి తీరలేదని..తెలంగాణను 8లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు. ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నుంచి దించేసి శిక్ష వేశారని, పార్లమెంట్ ఎన్నికల గుండుసున్నా ఇచ్చారనరి, ఎమ్మెల్సీల ఎన్నికలలో అభ్యర్థులు దొరకలేదని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బండకేసి కొట్టారన్నారు. బీఆర్ఎస్ ను బొంద పెట్టేందుకు ఆ పార్టీకి గుదిబండ కేటీఆర్ ఒక్కడు చాలన్నారు.

ఇందిరమ్మ ప్రభుత్వంలోనే పేదల సంక్షేమం

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తే కరెంటు రాదని కేసీఆర్ చెప్పాడని..ప్రజలు మాత్రం కేసీఆర్ ఇంట్లో కరెంటు లేకుండా ఫీజులు, స్టాటర్లు కూడా పీకేశారని రేవంత్ రెడ్డి చురకలేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ఇవ్వలేదని, రైతు రుణమాఫీ వడ్డీకే సరిపోయిందన్నారు. కేసీఆర్ మాత్రం వందల ఎకరాల్లో 2వేల కోట్లతో గడీల వంటి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని విమర్శించారు. ఆ పదేళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే 22 లక్షల ఇళ్లు ఇచ్చేవాళ్ళం అన్నారు. కాంగ్రెస్ హాయాంలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్తు అందుతుందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో 3 కోట్లు 10 లక్షల మందికి సన్న బియ్యం అందుతుందని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ సన్ని బియ్యం పథకం లేదన్నారు. పేదల ఆశలు తీర్చినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యం సహకారం అవుతుందన్నారు. అందుకే పేదలు గౌరవంగా జీవించేలా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 3,500ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 20,500కోట్లతో 4లక్షల 50 వేల ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. మేం వచ్చాక దేవరకొండ నియోజకవర్గంలోనే 14 వేల రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. 50లక్షల కుటుంబాల పేదలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతు భరోసాను పెంచి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, ఉచిబ బస్సు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 60వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పాలనలో యువత, మహిళలు, రైతులు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇక్కడ చదువుకున్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి లంబాడీలను ఎస్టీ చేర్పించారని గుర్తు చేశారు.

ఎస్ఎల్బీసీ, డిండి పథకాలు పూర్తి చేస్తాం

కేసీఆర్ ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రారంభించిన ఎస్ ఎల్బీసీ పథకాన్ని కేసీఆర్ పదేళ్లలో పగతో పడావు పెట్టాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేం వచ్చాక పనులు ప్రారంభించగా..ప్రమాదంతో కార్మికులు చనిపోతే మామా అల్లుళ్లు డ్యాన్స్ లు వేసుకున్నారన్నారు. మా ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల పూర్తి చేస్తామన్నారు. దేవరకొండ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే బాలునాయక్ అడిగిన అన్ని పనులు మంజూరు చేస్తామని, ఇందుకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీతక్క, లక్ష్మణ్ లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేవరకొండకు నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. దేవరకొండకు రాజధాని నుంచి ఫోర్ లైన్ రోడ్డు, మండల కేంద్రాలకు గ్రామాలకు మధ్య డబుల్ రోడ్డు, ప్రతి తండా నుంచి మండలానికి రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ మోడల్ ప్రకటిస్తామని తెలిపారు. గ్రామాల్లో మంత్రులు, ఎమ్యెల్యేలతో పనులు చేయించుకునే మనోళ్లను, మంచోళ్లను సర్పంచ్ లుగా ఎన్నుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. అలాగైతేనే గ్రామాల అభివృద్ది, ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.

Latest News