Vem Narender Reddy | తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆ రెండు స్థానాల్లో ఎవర్ని భర్తీ చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీలో తర్జనభర్జన కొనసాగింది. వీ హనుమంతరావు, చిన్నారెడ్డి లాంటి సీనియర్లు పోటీ పడినప్పటికీ.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికే ప్రాధాన్యం కల్పించారు. ఒక స్థానానికి సిటింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పేరును ఎంపిక చేయగా, ఆయన బుధవారం సాయంత్రమే హైదరాబాద్ వచ్చారు. రెండో స్థానానికి అభ్యర్థి ఎవరనే దానిపై బుధవారం రాత్రి వరకు చర్చలు, సంప్రదింపుల తర్వాత వేం నరేందర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో సీనియర్లు వీహెచ్, చిన్నారెడ్డి అలకబూనినట్లు తెలుస్తోంది.
వేం నరేందర్ రెడ్డి నేపథ్యం..
వేం నరేందర్‌రెడ్డి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో 1960 డిసెంబరు 26న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటమ్మ, చెన్నకృష్ణారెడ్డి. వరంగల్ నగరం సీకేఎం కాలేజీలో బీఏ డిగ్రీ చదివారు. తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ కూడా చేశారు. నరేందర్ రెడ్డికి భార్య విజయలక్ష్మి, కుమారులు కృష్ణ భార్గవ్, కృష్ణ కీర్తన్ ఉన్నారు.
రాజకీయ ప్రస్థానం:
- సోదరుడు వేం పురుషోత్తంరెడ్డితో కలిసి 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగు రైతు రాష్ట్ర సహాయక కార్యదర్శి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
- 2001లో నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు.
- 2004లో టీడీపీ తరఫున మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు.
- 2010లో ఉప ఎన్నికలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
- 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
- 2017లో రేవంత్‌రెడ్డితో కలసి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2021లో తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
- 2024 జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డికి ముఖ్య సలహాదారుగా క్యాబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో కొనసాగుతున్నారు.
