స్వీట్ వార్నింగ్… కాంగ్రెస్‌లో హాట్ టాపిక్!
పార్టీకీ, ఎమ్మెల్యేలకు మధ్య కోఆర్డినేషన్ నిల్
మూడేండ్లకే పార్టీ కేడర్‌కు దూరమైన ఎమ్మెల్యేలు
పార్టీ కంటే, పర్సనల్ ఇమేజ్‌కే తొలి ప్రాధాన్యత
రేవంత్ వార్నింగ్‌తో ‘నేతలు’ గాఢిన పడుతారా!
పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు భాగమయ్యేనా!
CM Revanth Reddy | విధాత, ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన స్వీట్ వార్నింగులూ… ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. పీసీసీ అధ్యక్షునిగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, సీఎం గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ కు మూడేళ్ళకు పార్టీ, ప్రభుత్వం మధ్య కనీస సమన్వయంలేదనే జ్క్షానోదయం కలిగిందా? మూడేండ్లకే ఈ పరిస్థితి ఏర్పడితే రానున్న రోజుల్లో డేంజర్ బెల్స్ ఖాయమనే సంకేతాలు ఆయనలో భయాన్ని నెలకొల్పయా? అనే హాట్ హాట్ చర్చసాగుతోంది. మూడేండ్ల తర్వాతనైనా సీఎం రాష్ట్రంలో పార్టీకీ, ప్రజాప్రతినిధులకు మధ్య కనీస కోఆర్డినేషన్ లేని అంశాన్ని గుర్తించారా? అనే అనుమానాలూ, ప్రశ్నలు వ్యక్తమవుతుండగా… ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే రాబోయే రోజుల్లో పుట్టిమునగడం ఖాయమంటున్నారు.
సీఎం మాటలతో జ్క్షానోదయం కలిగేనా?
సీఎం రేవంత్ వ్యాఖ్యలనూ, ఆయన చేసిన సూచనలను మంత్రులూ, ఎమ్మెల్యేలూ, కార్పొరేషన్ చైర్మన్ లూ ఆచరణలో పెడుతారా? అసలు చెవిన పెడుతారా? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సీఎంగా రేవంత్ తన నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలూ, ప్రజాప్రతినిధులూ పార్టీకి కేటాయించాల్సిన సమయాన్ని నిర్ధేశించినప్పటికీ అమలూ, ఆచరణ ఇప్పుడు ముఖ్యమంటున్నారు.
విజయానికి కష్టపడ్డ కేడర్ పై నిర్లక్ష్యం
పదేండ్ల ప్రతిపక్ష పార్టీగా పడిన ఇబ్బందులూ, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ పడిన అవస్థలు, భరించిన కేసులూ, వేధింపులూ, అవస్థలను భరించి కసితో పనిచేసిన వారి త్యాగాలనూ, బాధలను అన్నింటి మరిచిపోయీ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా గెలువగానే, నామినేటెడ్ పోస్టులు దక్కగానే అంతా తమ గొప్ప అనే రీతిలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ప్రారంభమైందీ. ముఖ్యంగా గెలిచిన ఎమ్మెల్యేల్లో మెజారిటీ వ్యక్తులు, కష్టపడ్డ కార్యకర్తల బాగోగులూ, అధికారంలో వారికి దక్కాల్సిన వాటాను విస్మరించి సీఎం రేవంత్ చెప్పినట్లుగా నియోజకవర్గాలను తమ జాగీరుగా భావిస్తూ పార్టీనీ, చివరికి ప్రజలను కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ, పద్ధతి జాన్తానై తాము చెప్పినట్లు మీరు వినాలంటూ శాసిస్తున్న దుస్థితి నెలకొంది.
పార్టీని పట్టించుకోవడం వదిలేశారు
దేశంలో కాంగ్రెస్ పార్టీ పై, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీజేపీ, బీఆర్ఎస్ తదితర పక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను సైతం ఖండించలేని అచేతన స్థితికి చేరుకున్నారు. చివరికి తమ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీని విమర్శించినా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్న సందర్భాలున్నాయి. కొందరు ఎమ్మెల్యేలైతే ‘వెనుకేసుకోవడానికి’ ఇస్తున్న ప్రాధాన్యత, పార్టీ కోసం శ్రమించిన కేడర్ ను కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇక మంత్రులుగా ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలూ, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులూ, పార్టీ మధ్య సమన్వయ కర్తలుగా ఉండాల్సిన స్థానంలో తమ నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలూ పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. పార్టీ ఆఫీస్ లను కూడా సందర్శించడకుండా, పార్టీ కార్యక్రమానలు పట్టించుకోకుండా స్వంత ఇమేజన్ ను పెంచుకునే పనిలో ఉన్నారు. చివరికి సోషల్ మీడియాలో కూడా తమ డబ్బా తప్ప పార్టీ గురించి, ప్రభుత్వం గురించి ప్రచారం చేయకుండా తామూ, తమ కుటుంబం, రాబోయే రోజుల్లో తమ రాజకీయ వారసత్వం, తమ వర్గానికి పెద్ద పీట వేస్తూ పార్టీ కోసం శ్రమించిన వారిని విస్మరిస్తున్నారు. పార్టీ విభాగాల కంటే, ఆయా నేతల ఇమేజ్ పెంచే దిశగా పర్సనల్ ‘సేన’లను ఏర్పాటు చేసుకుని భజన బ్యాచ్ లను పెంచి పోషిస్తున్నారు. దీంతో స్వంత పార్టీలోనే ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లోనైతే తమకు , తమ కుటుంబ సభ్యులకు తప్ప పార్టీలో మరో నాయకుడికి పదవి కూడా ఇవ్వకుండా తొక్కిపెడుతున్నారు. ఏ చిన్న అవకాశం ఇచ్చినా తమకు పోటీగా మారుతారని భావించి తొక్కిపెడుతున్నారు. ఈ అంశాలను ఆలశ్యంగానైనా సీఎం గుర్తించి క్లాస్ పీకారని భావిస్తున్నారు. అయితే పేనుకుట్టినట్లు కూడా లేని ఈ నాయకుల్లో సీఎం మాటలతో మార్పు వస్తుందా? అనేదే ఇప్పుడు అనుమానం. సరైన మానిటరింగ్, పర్యవేక్షణ లేకుండా ఏదో ఒక సందర్భంలో మాట్లాడితే అత్మసంతృప్తి తప్పితే పార్టీ పురోగమానానికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చంటూ పెదవి విరుస్తున్నారు.
ఇకనైనా సమన్వయం సాగేనా?
ఇప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలూ, ప్రభుత్వ కార్యక్రమాల మధ్య సమన్వయం చేసుకుంటూ పార్టీ యాక్టివిటీలో భాగస్వామ్యమైతే కేడర్ లో నెలకొన్న నిరుత్సాహం తగ్గి, ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరికివారే అన్నట్లు ఒకరి మాట మరొకలు వినకుండా ఏకపక్షంగా వ్యవహరించడం రివాజుగా మారింది. సీఎం చెప్పినట్లు ఆయన ముందుగా పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటూ ఇంచార్జ్ మంత్రులు నెలకు మూడు రోజులు పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యమైతే నిజంగానే పార్టీలో కొంత మార్పుతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు దోహదం చేస్తుందంటున్నారు. తమను ఈ స్థాయికి తీసుకొచ్చి పార్టీని పట్టించుకోకపోవడం క్షమించరాని విషయమంటున్నారు పార్టీలోని కరుడుగట్టిన కేడర్. సీఎం రేవంత్ సూచనలూ, స్వీట్ వార్నింగులను మంత్రులూ, ఎమ్మెల్యేలూ, ప్రజా ప్రతినిధులూ ఏ మేరకు అమలు చేస్తారనేదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.