Site icon vidhaatha

Chandipura virus | కలకలం రేపుతున్న చాందీపురా వైరస్‌.. గుజరాత్‌లో 8 మంది చిన్నారులు మృతి..!

Chandipura virus : గుజరాత్‌ రాష్ట్రంలో అనుమానాస్పద చాందీపురా వైరస్‌ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ బారినపడి మంగళవారం మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటిదాకా ఈ వైరస్‌ బారినపడి మరణించిన చిన్నారుల సంఖ్య 8కి చేరింది. గుజరాత్‌ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రిషికేశ్‌ పటేల్‌ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇప్పటిదాకా మొత్తం 14 మందికి ఈ వైరస్‌ సోకగా.. వారిలో 8 మంది మృతిచెందినట్లు గుజరాత్‌ ఆరోగ్యశాఖ తెలిపింది. సాబర్‌కాంఠా, ఆరావళి, మహిసాగర్, ఖేడా, మెహ్‌సాణా, రాజ్‌కోట్‌ జిల్లాల్లో ఈ వైరస్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రి మీడియాకు చెప్పారు. పొరుగున ఉన్న రాజస్థాన్‌ నుంచి రెండు, మధ్యప్రదేశ్‌ నుంచి మరో కేసు ఇక్కడికి వచ్చాయని తెలిపారు. మరణాల రేటు అధికంగా ఉన్న ఈ వైరస్‌ సోకినపుడు చికిత్సలో ఆలస్యం చేయడం ప్రాణాంతకమని హెచ్చరించారు.

ఆయా జిల్లాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వైరస్‌ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని ఆరోగ్య మంత్రి వెల్లడించారు. రోగుల రక్త నమూనాలను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపినట్లు తెలిపారు. కాగా, ఈ వైరస్‌ సోకిన వ్యక్తిలో ఫ్లూ లక్షణాలతోపాటు జ్వరం, మెదడువాపు వంటివి కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది.

Exit mobile version