Site icon vidhaatha

Chhatrapati statue collapsed । మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం

Chhatrapati statue collapsed । మాల్వన్‌లోని రాజ్‌కోట్‌ కోట (Rajkot Fort) వద్ద ఏర్పాటు చేసిన మరాఠా రాజు ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji Maharaj) 35 అడుగుల విగ్రహం సోమవారం (2024, ఆగస్ట్‌ 26) కూలిపోయింది. నావికా దినోత్సవాలను (Navy Day celebrations) పురస్కరించుకుని సింధుదుర్గ్‌ జిల్లాలోని మాల్వన్‌లో ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) గత ఏడాది డిసెంబర్‌ 4వ తేదీన ఆవిష్కరించారు. ఏడాదిలోపే విగ్రహం కూలిపోవడంపై ప్రతిపక్షాలు, ప్రజలు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘సింధుదుర్గ్‌ (Sindhudurg) వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహం ఈ రోజు కూలిపోయింది. మోదీజీ దీనిని గతేడాది డిసెంబర్‌లో ఆవిష్కరించారు. ఈ విగ్రహం పని చేసిన కాంట్రాక్టర్‌ ఎవరు? ఠాణెకు చెందిన ఒక కాంట్రాక్టర్‌కు ఈ పనిని అప్పగించిన విషయం వాస్తమేనా? ఈ కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్య తీసుకోనున్నారు? ‘ఖోకే (బాక్సుల) సర్కారుకు (khoke Sarkar) కాంట్రాక్టర్‌ ఎన్ని బాక్సులు ఇచ్చాడు?’ అని శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) ఎక్స్‌లో ప్రశ్నించారు. ఈ విషయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కాంగ్రెస్‌ పార్టీ కేరళ సామాజిక మాధ్యం టార్గెట్‌ చేసింది. ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఆ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ కూడా పాల్గొన్నారు. ‘ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్‌ వారసత్వానికి అవమానమని మహారాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ విమర్శించింది.
‘సింధ్‌దుర్గ్‌లోని రాజ్‌కోట్‌ కోట వద్ద కొద్ది నెలల క్రితం ప్రధాని మోదీ హడావుడిగా ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ భారీ విగ్రహం అకస్మాత్తుగా కూలిపోయింది. విగ్రహం అనేక ముక్కలైంది. నాణ్యతలేని మెటీరియల్‌ వాడటం వల్లే విగ్రహం కూలిపోయిందని మహాయుతి (MahaYuti govt) ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి’ అని సీనియర్‌ జర్నలిస్టు సుధీర్‌ సూర్యవంశి పేర్కొన్నారు. గత రెండు మూడు రోజులుగా సింధ్‌దుర్గ్‌ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయితే.. వాతావరణ ప్రతికూలతలను తట్టుకుని నిలిచేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. నాణ్యతలేని మెటీరియల్‌ వల్లే విగ్రహం కూలిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Exit mobile version