Site icon vidhaatha

ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ మళ్లీ డుమ్మా..

న్యూఢిల్లీ: లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి డుమ్మా కొట్టారు. ఈడీ ఇచ్చిన నోటీసులు చట్ట వ్యతిరేకం, రాజకీయ ఉద్దేశపూరతమని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో గురువారం ఆయన ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం విపాసన సెషన్‌కు హాజరయ్యేందుకు వెళ్లిపోయారు. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి.


గతంలో డిసెంబర్‌ 18న హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. దానికి ఆయన వెళ్లలేదు. దీంతో తాజాగా జారీ చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో విపాసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి వెళతారని డిసెంబర్‌ 16న పార్టీ వర్గాలు ప్రకటించాయి. అయితే.. ఆ తర్వాత రెండు రోజులకు ఆయనకు ఈడీ సమన్లు జారీచేసింది. తనకు నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కేజ్రీవాల్‌.. ఈడీకి లేఖ రాశారు.


‘నేను ప్రతి చట్టబద్ధమైన సమన్లను అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. గత సమన్ల మాదిరిగానే ఇప్పుడు ఇచ్చినవి కూడా చట్టవ్యతిరేకమైనవి. ఈడీ సమన్లు రాజకీయ ఉద్దేశాలతో ఇచ్చినవి. వాటిని ఉపసంహరించుకోవాలి. నేను పూర్తి పారదర్శకతతో, నిజాయితీతో జీవిస్తున్నాను. నేను దాయటానికి ఏమీ లేదు’ అని కేజ్రీవాల్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. తనను ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా పిలుస్తున్నారా అనే విషయంలో కూడా నోటీసులలో స్పష్టత లేదని తెలిపారు.

Exit mobile version