Loksabha Elections | లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఈ ఆసక్తికర అంశాలు గమనించారా?

లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనతో దేశంలో అతిపెద్ద ప్రజాస్వామిక తంతు ముగిసింది. అనేక ఆసక్తికర అంశాలు ఈ ఫలితాల్లో ఇమిడి ఉన్నాయి. ఇక ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశంలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. బీజేపీకి జనం మెజార్టీ తగ్గించినా.. దాని భాగస్వామ్యపక్షాలతో కలుపుకొని మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉన్నది.

  • Publish Date - June 5, 2024 / 07:34 PM IST

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనతో దేశంలో అతిపెద్ద ప్రజాస్వామిక తంతు ముగిసింది. అనేక ఆసక్తికర అంశాలు ఈ ఫలితాల్లో ఇమిడి ఉన్నాయి. ఇక ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశంలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. బీజేపీకి జనం మెజార్టీ తగ్గించినా.. దాని భాగస్వామ్యపక్షాలతో కలుపుకొని మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉన్నది. అంటే.. ఇన్నాళ్లూ నా మాటే శాసనం అన్న పద్ధతిలో సాగిన మోదీ పాలన.. ఇక మీ మాటే మా శాసనం అనే పద్ధతిలో భాగస్వామ్యపక్షాలను కలుపుకొని నడిపించుకోవాల్సి ఉంటుంది. 1989 తర్వాత మొదలై, పదేళ్ల క్రితం బ్రేక్‌ పడిన సంకీర్ణ యుగానికి మరోసారి తెర లేచింది. ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

టేక్‌ 1
తగ్గిన మోదీ చరిష్మా

మోదీ చరిష్మా కొంతకాలంగా తగ్గుతూ వస్తున్నదనే వాదనలు ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గల్లీ స్థాయి నేతలా మారి అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించినా బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురాలేక పోయారు. అది గతం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన వారణాసి నియోజకవర్గంలో సాధించిన మెజార్టీని గమనిస్తే ఆయన చరిష్మా తగ్గిపోతున్నదనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. వాస్తవానికి గత లోక్‌సభ ఎన్నికల్లో 4,79,505 మెజార్టీని మోదీ సాధించారు. ఇది 2014 ఎన్నికలతో మోదీకి లభించిన మెజార్టీ 3,71,784తో పోల్చితే ఎక్కువ. 2024 ఎన్నికల్లో మోదీ మెజార్టీ మరింత పెరుగుతుందని ఆయన భక్తులు చెబుతూ వచ్చారు. కానీ.. మోదీకి వారణాసిలో లభించిన మెజార్టీ 1,52,513. అంటే.. వారణాసిలో మోదీని గత ఎన్నికల్లో ఆమోదించినవారిలో దాదాపు 3.27 లక్షల మంది ఓటర్లు మోదీని తిరస్కరించారన్నమాట! మోదీ ఇక్కడ సాధించిన మెజార్టీ.. రాయ్‌బరేలీలో రాహుల్‌ గాంధీ సాధించిన మెజార్టీలో దాదాపు సగం. రాయ్‌బరేలీలో రాహుల్‌కు 3,90,030 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంతేకాదు.. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడించిన కిశోరాలాల్‌ శర్మ సాధించిన మెజార్టీకంటే కూడా తక్కువ. కిశోరీలాల్‌కు 1,67,196 మెజార్టీ లభించింది. తన నామినేషన్‌ దాఖలు సందర్భంగా తన జన్మకు దైవకారణం ఉందని చెప్పుకున్న మోదీ.. ఈ మెజార్టీ తగ్గుదలకు కారణం ఏమని చెబుతారు?

టేక్‌ 2
రాముడి గుడి

బీజేపీ రాజకీయం మొత్తం రాముడి గుడి చుట్టూనే దశాబ్దాలుగా తిరుగుతూ వచ్చింది. అయోధ్యలో రాముడి గుడి కడతామని చెప్పి ఓట్లు వేయించుకోవడం బీజేపీకి ప్రతి ఎన్నికల్లో పరిపాటిగా మారింది. మోదీ, అమిత్‌షా, యూపీ ముఖ్యమంత్ర ఆదిత్యనాథ్‌ సహా అనేక మంది నాయకులు రాముడి గుడి కట్టినందుకు ఓటేయాలని నేరుగానే విజ్ఞప్తి చేశారు. తాము మళ్లీ గెలిస్తే రాముడి దర్శనానికి ఉచితంగా తీసుకుపోతామని కూడా హామీ గుప్పించారు. అయితే.. రాముడి ఫ్యాక్టర్‌ బీజేపీకి అయోధ్య ఉన్న ఫైజాబాద్‌లోనే వర్కవుట్‌ కాలేదు. ఇక్కడ సమాజ్‌వాది పార్టీ జనరల్‌ క్యాటగిరీ సీటులో దళితుడైన అవధేశ్‌ ప్రసాద్‌ను నిలబెట్టింది. అయోధ్యలో గుడికట్టాక అయోధ్య ఉన్న నియోజకవర్గం బీజేపీకి కాకుండా మరెవరికి వెళుతుందనే భావనను ఫైజాబాద్‌ ప్రజలు పటాపంచలు చేశారు. దళితుడైన అవధేశ్‌ ప్రసాద్‌ను గెలిపించి.. బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్‌ను ఇంటికి పంపారు. రాముడి పేరుతో ఓట్లు దండుకోవాలన్న బీజేపీ ప్రయత్నాన్ని అయోధ్య ఉన్న నియోజకవర్గం ప్రజలే తిరస్కరించడం కీలకం అంశం.

టేక్‌ 3
హిందీ బెల్ట్‌లో కరుగుతున్న బీజేపీ ప్రభావం

హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి బలం ఉందనే భావనలు కూడా క్రమంగా కరిగిపోక తప్పదు. దీనికి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌ నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిలో యూపీ, బీహార్‌లో ఆ పార్టీ సాధించిన సీట్లను పక్కనపెడితే.. 8 % చొప్పున ఓట్లు కోల్పోయాయి. యూపీలో 80 సీట్లకు గాను బీఏపీ 33 సీట్లు గెలిచింది. బీహార్‌లో 40 సీట్లకుగాను ఎన్డీయే 29 సీట్లు గెలిచింది. రాజస్థాన్‌లో బీజేపీ ఓటు షేరు గతంతో పోల్చితే 12 శాతం పడిపోయింది.

టేక్‌ 4
ధుబ్రి చైతన్యం

అసోంలోని ధుబ్రి నియోజకవర్గం అత్యంత చైతన్యాన్ని ప్రదర్శించింది. ముస్లింలు అత్యధికంగా ఉండే నియోజకవర్గం ఇది. ఇక్కడ ఏఐయూడీఎఫ్‌ తరఫున బద్రుద్దీన్‌ అజ్మల్‌ పోటీ చేశారు. సాధారణంగా ముస్లిం ఓటు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉన్నా.. ముస్లిం పార్టీలకు వెళుతుందనే భావన ఉన్నది. కానీ.. ధుబ్రిలో కథ మరో విధంగా ఉన్నది. అజ్మల్‌ ఇక్కడ కాంగ్రెస్‌ ప్రత్యర్థి చేతిలో 10,12,476 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తమిళనాడులో కరడుగట్టిన హిందూత్వవాదిగా పేరుపడిన అన్నామలై విజయం కోసం మోదీ ఎంత శ్రమించినా.. ఓబీసీ నేత అయి ఉండి కూడా గెలవలేక పోయారు. కేవలం 11శాతం ఓట్లు మాత్రమే బీజేపీకి లభించాయి.

టేక్‌ 5
నోటాకు కూడా ఓటేయనీయలేదు!

ఈ ఎన్నికల్లో సుమారు 16.55 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూరమయ్యారు. వారే గుజరాత్‌లోని సూరత్‌ ఓటర్లు. అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఇక్కడ బీజేపీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఒక్కరే బరిలో నిలిచారు. పోలింగ్‌కు ముందే బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి సహా అందరూ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను, ఇండిపెండెంట్లను బరి నుంచి తప్పించారన్న వార్తలు వచ్చాయి. ఇండోర్‌లో తనను బరి నుంచి తప్పించేందుకు బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాన్ని అప్పట్లోనే సోషలిస్టు యునిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌యూసీఐ) అభ్యర్థి అజిత్‌సింగ్‌ చెప్పారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఆయన మాత్రం నామినేషన్‌ ఉపసహరించుకునేందుకు నిరాకరించారు. ఈ ఎన్నికల్లో ఆయన సంకల్పానికి 7,179 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ.. దేశంలోనే రికార్డు స్థాయిలో 2,18,674 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ప్రజాస్వామ్యంలో అనైతిక చర్యలను సహించేది లేదని ఓటరు ఇలా తీర్పు చెప్పాడు.

టేక్‌ 6
సబ్‌ కా విశ్వాస్‌ ఎక్కడ?

ముస్లిలు అధికంగా ఉండే కశ్మీర్‌లో బీజేపీ ఈసారి అభ్యర్థులను నిలిపే సాహసం కూడా చేయలేదు. బౌద్ధులు అధికంగా ఉండే లద్దాఖ్‌లో అభ్యర్థిని నిలిపినా.. ఆయన మూడో స్థానంలో నిలిచారు. కుకీ, జో తెగల మధ్య తీవ్ర హింసకు ప్రభావితమైన మిజోరంలో బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానం దక్కించుకున్నారు. క్రైస్తవులు అధికంగా నివసించే నాగాలాండ్‌లో బీజేపీకి అభ్యర్థే లేడు. సిక్కుల రాష్ట్రమైన పంజాబ్‌లో మూడు సీట్లలో మాత్రం రెండో స్థానాన్ని పొందగలిగింది. ముస్లింలు అధికంగా ఉండే మరో నియోజకవర్గం లక్షద్వీప్‌. ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ లక్షద్వీప్‌కు వెళ్లి సముద్ర తీరం వద్ద ఫొటోలు దిగి.. మాల్దీవులపై వ్యతిరేకతను రెచ్చగొట్టారు. కానీ.. లక్షద్వీప్‌లో బీజేపీకి అభ్యర్థే లేడు.

టేక్‌ 7
మంగళసూత్రాలు గుంజుకుపోతారని మోదీ చెప్పిన చోట!

చార్‌ సౌ పార్‌, రాముడు వంటి అంశాలు తొలి మూడు దశల్లో పనిచేయలేదని అర్థమైన తర్వాత మోదీ తన విద్వేష ప్రసంగాల డోస్‌ పెంచిన బహిరంగ సభలు జరిగింది రాజస్థాన్‌లోని బన్స్వారా, గుజరాత్‌లోని బనస్కాంత నియోజకవర్గాల్లోనే. ఒక విధంగా ఈ ఎన్నికల ప్రచారంలో మోదీ తొలి విద్వేషపూరిత ఉపన్యాసాలు మొదలు పెట్టింది ఇక్కడే. ఏప్రిల్‌ 21న బన్స్వారాలో నిర్వహించిన సభలో మాట్లాడిన మోదీ.. ‘వాళ్లు (కాంగ్రెస్‌) అధికారంలో ఉన్నప్పుడు దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉన్నదని చెప్పారు. దీనర్థం ఏమిటంటే.. ఈ ఆస్తులను తీసుకుని, (ముస్లింలనుద్దేశించి) అధిక సంతానం ఉన్నవారు, చొరబాటుదారులకు ఇచ్చేస్తారు. మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను చొరబాటుదారులకు ఇవ్వడాన్ని మీరు ఒప్పుకొంటారా? కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చెబుతున్నది ఇదే. మన తల్లులు, బిడ్డల బంగారాన్ని కొలిచి, వాటిని తీసుకుని, పంచిపెడతారు. ముస్లింలకు ఆస్తులపై తొలి హక్కు ఉన్నదని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం చెప్పింది. వారికి ఇచ్చేస్తారు. ఈ అర్బన్‌ నక్సలైట్లు మన తల్లులు, చెల్లెళ్ల మంగళసూత్రాలను కూడా విడిచిపెట్టరు. అంతకు కూడా వారు తెగిస్తారు’ అని ముస్లింలపై ద్వేషం నూరిపోసేందుకు ప్రయత్నించారు. కానీ.. ఇక్కడ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం భారత్‌ ఆదివాసీ పార్టీ అభ్యర్థిని బన్స్వారా ప్రజలు 2,47,504 ఓట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించారు. విద్వేషపూరిత ప్రసంగాలకు తాము లొంగేది లేదని విస్పష్టంగా తేల్చి చెప్పారు.
గుజరాత్‌లోని బనస్కాంతలో కూడా మోదీ విద్వేషం నింపేందుక ప్రయత్నించారు. మే 1వ తేదీన ఇక్కడ నిర్వహించిన సభలో మాట్లాడిన మోదీ.. ‘మీకు రెండు ఆవులు ఉంటే.. ఇండియా కూటమి ఒకటి గుంజుకుని, తమ ఓటు బ్యాంకుకు ఇచ్చేస్తుంది’ అని హెచ్చరించారు. కానీ.. బనస్కాంత ప్రజలు వివేకంతో ఓటు వేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బేనిబెన్‌ నాగాజీ ఠాకూర్‌ను 30,406 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఈ సీటుకు ఒక ప్రాముఖ్యం కూడా ఉన్నది. దశాబ్ద కాలం తర్వాత గుజరాత్‌లో బీజేపీయేతర పార్టీ ఒక సీటు గెలవడం ఇదే తొలిసారి.

టేక్‌ 8
మోదీకి అతిపెద్ద ఎన్నికల దెబ్బ

నరేంద్రమోదీ 23 ఏళ్లుగా ఎన్నికల రాజకీయాల్లో ఉన్నారు. కానీ.. మోదీకి మెజార్టీ దక్కకపోవడం ఇదే మొదటిసారి. 2002లో గుజరాత్‌లో మొదలు.. 2014లో జాతీయస్థాయి నేత వరకూ విద్వేషపూరిత రాజకీయాలకు బ్రాండ్‌గా మారారు. 48 పేజీల బీజేపీ మ్యానిఫెస్టోలో 67 సార్లు మోదీ పేరు ప్రస్తావన చేసుకుని, ఈ ఎన్నిక తన పాలనకు రెఫరెండమని చెప్పుకొన్నా.. గతంకంటే బీజేపీ సీట్లు తగ్గిపోయాయి.

Latest News