బెంగళూరులోని మటన్ షాపుపై హిందూత్వ గ్రూపుల ఆరోపణ
పన్నెండేళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్నానంటున్న వ్యాపారి
నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిన అధికారులు
బెంగళూరు: మేక మాంసం పేరుతో కుక్క మాంసాన్ని అమ్మేస్తున్నారంటూ బెంగళూరులోని హిందూత్వ గ్రూపులు చేసిన ఆరోపణలతో స్థానికంగా కలవరం రేగింది. కేఎస్‌ఆర్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక మటన్‌షాపులో కుక్క మాంసం అమ్ముతున్నారని వారు ఆరోపించారు. జైపూర్..మైసూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా జైపూర్ నుంచి ఈ మాంసాన్ని రవాణా చేసినట్టు హిందూత్వ గ్రూపులు ఆరోపించాయి. అయితే.. సదరు వర్తకుడు మాత్రం తాను పన్నెండేళ్లుగా ఇదే వ్యాపారంలో ఉన్నానని, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని మొత్తుకుంటున్నాడు. ఈ వివాదం నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆహార భద్రత అధికారులు మాంసం నమూనాలను సేకరించి, ల్యాబొరేటరీకి పంపారు.
విక్రయిస్తున్నది ఏ జంతువు మాంసమో పరీక్షల్లో తేలుతుందని కమిషనర్ చెప్పారు. ఈ మాంసం రాజస్థాన్ నుంచి రవాణా అయినట్టు తేలిందని పేర్కొన్నారు. మొత్తం 9 పార్శిళ్లు ఉన్నాయని తెలిపారు. మాంసంలో కల్తీ ఉన్నట్టయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి ఈ ఘటన బెంగళూరులోని మాంసం ప్రియుల్లో కలవరం రేపింది. దీనిపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్ దాస్ పై ఎక్స్‌లో స్పందించారు. ‘ఇది దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. మన ప్రభుత్వం ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటుంది?’ అని ప్రశ్నించారు.