ఈ ఏడాది కరువేనా? పొలాల్లో మొలకెత్తని విత్తనాలు బిందెల్లో నీళ్లు తీసుకొచ్చి పొలాలు తడుపుతున్న అన్నదాతలు

వర్షాలు మొఖం చాటేస్తున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే మే నెలలో కురిసిన వర్షాలు ముందు మురిపించాయి. జూన్ నెల మొదటి వారంలో అడపదడపా కురిసిన వర్షం గత 15 రోజులుగా ముఖం చాటేసింది

  • Publish Date - June 27, 2024 / 12:59 AM IST

మేఘాలు తప్ప జాడలేని వర్షం
ఊరిస్తున్న వరుణ దేవుడు
వట్టిపోయిన రిజర్వాయర్లు
పడిపోయిన భూగర్భ జలమట్టం

విధాత: వర్షాలు మొఖం చాటేస్తున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే మే నెలలో కురిసిన వర్షాలు ముందు మురిపించాయి. జూన్ నెల మొదటి వారంలో అడపదడపా కురిసిన వర్షం గత 15 రోజులుగా ముఖం చాటేసింది. తొలకరిలో కురిసిన వర్షాలతో సంతోషంతో దుక్కి సిద్ధం చేసుకొని విత్తనం నాటిన రైతన్నకు ఇప్పుడు ఆ విత్తనాన్ని కాపాడు కోవడం సవాలుగా మారింది. అనేక ప్రాంతాల్లో రైతులు బిందెలతో నీళ్లు తీసుకు వెళ్లి పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనం మొలక వచ్చింది. వచ్చిన మొలకలు వర్షం లేక వాడిపోతున్నాయి. దీంతో రైతులు మళ్లీ తిరిగి విత్తనం నాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అన్న ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితి ఇంకా కొంత కాలం ఇలాగే కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకూ 30 లక్షల ఎకరాల్లో విత్తనాల

ఈ వర్షాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల ఎకరాల భూమిలో రైతులు వివిధ విత్తనాలు వేసినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా వరి పంట కోసం రైతులు ఇప్పటికే హార్వెస్టింగ్ మొదలు పెట్టారు. కానీ వర్షాలు వెనుక పట్టు పట్టడంతో నీళ్లు ఎలా అన్న బెంగ పెట్టుకున్నారు. గత ఏడాది కూడా వర్షాలు సరిగ్గా కురువక పోవడంతో ప్రధాన రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రధాన రిజర్వాయర్లలో 2023 జూన్‌లో 370.02 టీఎంసీల నీరు ఉండగా, ఈ ఏడాది 2024 జూన్ నాటికి 229.53 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించే పరిస్థితి కనిపిస్తోంది. భూగర్భ జలమట్టం 2023 జూన్‌లో 6.24 మీటర్ల లోతున ఉండగా ఈ ఏడాది 2024 జూన్ లో 10.36 మీటర్ల లోతుకు పడిపోయింది.

గతేడాది 200 మండలాల్లో కరువు పరిస్థితులు

2023-24 ఆర్థిక సంవత్సరంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 200 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితి నెలకొన్నది. రిజర్వాయర్లకు వరద నీరు రాకపోవడంతో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయలేక పోయింది. గత ఏడాది కంటే ఈ సీజన్ లో సాగర్ జలాశయంలో మరింత నీటి మట్టం పడిపోయింది. గత ఏడాది సాగర్ లో149.46 టీఎంసీల నీరు ఉండగా ఈ ఏడాది 122.52 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దాదాపు 40 ఏళ్ల తరువాత కృష్ణా నది తీవ్ర నీటి లోటును ఎదుర్కొంటున్నది జల వనరుల నిపుణులు చెపుతున్నారు. ఈ ఏడాది పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయకట్టు భూమికి సాగునీరు ఇచ్చే పరిస్థితి ఉండదని అధికారులు అంటున్నారు. అయితే ఇది జూన్ నెల మాత్రమే కావడంతో వర్షాకాలం సెప్టెంబర్ వరకు ఉన్నందున రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా వర్షాకాలం సీజన్ ప్రారంభం కాకముందే మే నెలలో 128 శాతం అధికంగా వర్షం కురిసింది. దీంతో రైతుల్లో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని రైతులు సంతోషించారు. రైతుల్లో ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. మేలో కురిసి రైతుల్లో ఆశలు కల్పించిన వర్షాలు జూన్ రెండవ వారం తరువాత నిరాశ కలిగించాయి. ఇప్పటికే 16 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ జిల్లా మినహా అంతటా సాధారణ వర్షం మాత్రమే కురిసినట్లు వాతావరణ శాఖ తెలుపుతోంది. 15 రోజులుగా సరిగ్గా వర్షాలు కురువక పోవడంతో రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదు. విత్తు మొలకెత్తిన చోట్ల మొలకలకు నీరు అందక అవి వాడి పోతున్నాయి. ఈ పరిస్థితిలో రైతులు విత్తనాలు, ఎరువులకు తీవ్ర నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.

అమల్లో లేని పంటల బీమా

పంటల బీమా పథకం అమలులో లేక పోవడంతో రైతులు ఆర్థికంగా నష్ట పోయే అవకాశం ఉంది. పంటల బీమా పథకం అమలులో ఉంటే విత్తనం నాటిన తరువాత వరుసగా 15 రోజులు వర్షాలు కురువకుండా నష్టం జరిగితే రైతులకు ఎకరాకు రూ.3 వేల వరకు నష్టపరిహారం వచ్చేది. కానీ గత ప్రభుత్వం పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ఏడాది వర్షాకాలం నుంచే పంటల బీమా పథకం అమలు చేస్తానన్న ప్రభుత్వం ఇప్పటి ప్రీమియం చెల్లించలేదు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లింపులు జరిగి ఉంటే నష్టపోయిన రైతులకు ఇప్పటికే బీమా సొమ్ము లభించేదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పంటల బీమా ప్రీమియం చెల్లించి ఈ పథకం అమలు చేయాలని కోరుతున్నారు. మరో వైపు కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Latest News