Jammu & Kashmir Blast : అది ఉగ్ర కుట్ర కాదు..ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు: జమ్మూ కశ్మీర్ డీజీపీ

జమ్మూ కశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన బాంబు పేలుడు ఘటన ఉగ్ర కుట్ర కాదని, ప్రమాదవశాత్తు జరిగిందని డీజీపీ నలిన్ ప్రభావత్ స్పష్టం చేశారు. విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న అమ్మెనీయం నైట్రెట్ శాంపిల్స్ తీస్తుండగా ఈ పేలుడు సంభవించిందన్నారు.

Jammu kashmir DGP

జమ్మూ కశ్మీర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన బాంబు పేలుడు ఘటన ఉగ్ర కుట్ర కాదని..ప్రమాదవ శాత్తు జరిగిందని ఆ రాష్ట్ర డీజీపీ నలిన్ ప్రభావత్ ప్రకటించారు. ఈ పేలుడు ఘటనలో 9మంది మృతి చెందడం..27 మంది గాయపడటం జరిగింది. పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యగా వార్తలు వెలువడటంతో డీజీపీ ప్రభావత్ దీనిపై స్పష్టత నిచ్చారు. కేసు విచారణలో భాగంగా స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన అమ్మెనీయం నైట్రెట్ పేలుడు పదార్ధాలను పరిశీలీస్తుండగా పేలుడు జరిగిందని వెల్లడించారు.

నౌగామ్ పోలీస్ స్టేషన్ పేలుడు ఘటన మా పనే అని..జైషేకు అనుబంధ సంస్థ అయిన పీపుల్స్‌- యాంటీ ఫాసిస్టు ఫోర్స్‌ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. శనివారం డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉగ్రవాద సంస్థ ప్రకటనను ఖండించారు. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఉగ్రవాదుల మాడ్యూల్ ను చేధించి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్ధాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించేందుకు వాటి నుంచి సిబ్బంది శాంపిల్స్ తీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా పేలుడు జరిగిందని వివరించారు. దీనిపై అనవసర ఊహాగానాలు చేయవద్దన్నారు. తప్పుడు కథనాలు వెలువరించవద్దని సూచించారు.

నౌగామ్ పోలీస్ స్టేషన్ పేలుడు ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని ధ్రువీకరించారు. 27 మంది పోలీసుసిబ్బందితో పాటు ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు గాయపడినట్లు వెల్లడించారు. వారికి చికిత్స అందుతుందన్నారు. పేలుడు నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌ పూర్తిగా దెబ్బతిందని, పక్క భవనాలు కూడా స్వల్పవంగా దెబ్బతిన్నాయన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీ ఎర్రకోట వద్ధ కారు బాంబు పేలుడు ఘటనతో సంబంధం ఉన్న ఫరీదాబాద్ పేలుడు పదార్ధాల కేసును నౌగామ్ పోలీసులు విచారిస్తున్న క్రమంలో పేలుడు జరిగి వారు ప్రాణాలు కోల్పోవడం దర్యాప్తు బృందాలను నివ్వెరపరిచింది.