Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని నౌగామ్ పోలీసు స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించిది. ఈ పేలుడు ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బందితో పాటు ఇద్దరు అధికారులు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉగ్రకుట్రకు సంబంధించిన 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వాటిని నౌగామ్ పీఎస్‌కు తరలించారు. ఈ పేలుడు పదార్థాల నుంచి శుక్రవారం రాత్రి 11.22 గంటల సమయంలో శాంపిల్స్ తీస్తుండగా విస్ఫోటనం చోటు చేసుకుంది. భారీ పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పోలీసు స్టేషన్ భవనం కుప్పకూలింది. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఈ పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్లు స్థానికులు తెలిపారు. అక్కడున్న వాహనాలు కూడా మంటల్లో అంటుకున్నాయి.
పేలుడు ఘటనలో చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను శ్రీనగర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు తరలించారు. గాయపడిన వారిలో 24 మంది పోలీసులు ఉన్నారు. వీరంతా శ్రీనగర్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
