Girl Child | ఆడబిడ్డ అంటేనే ఈసడించుకుంటున్న ఈ రోజుల్లో.. ఈ కుటుంబం మాత్రం అదే ఆడబిడ్డ( Girl Child )కు ఘనస్వాగతం పలికింది. కేవలం కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే కాదు.. దాదాపు 130 గ్రామాల ప్రజలు ఆ పసిబిడ్డ( Infant )ను ఆశీర్వదించారు. మరి ఇంత ప్రత్యేకత ఎందుకో తెలుసుకోవాలంటే హర్యానా( Haryana ) వెళ్లాల్సిందే..
సోనిపట్ జిల్లా మహలానా గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో 35 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఆడబిడ్డ పుట్టిన ఆనందాన్ని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. దీంతో జనవరి 6వ తేదీన మహలానా గ్రామంలో సంబురాలు అంబరాన్నంటాయి. కేవలం ఆ గ్రామానికే ఈ వేడుకలు పరిమితం కాలేదు. సుమారు 130 గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి ఆ పసిబిడ్డను ఆశీర్వదించారు.
కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం
పసిబిడ్డతో పాటు ఆమె తల్లికి కనీవినీ ఎరుగని రీతిలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఏనుగులు, గుర్రాలు, రథాలతో ఊరేగిస్తూ పూల వర్షం కురిపించారు. ప్రత్యేక పూజలతో పాటు హోమం నిర్వహించారు. దీంతో మహలానా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.
ఆడబిడ్డకు కామాక్షిగా నామకరణం..
35 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడబిడ్డకు కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతుల్లో నామకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆ చిన్నారికి కామాక్షి అని నామకరణం చేశారు. ఈ వేడుకల సందర్భంగా వచ్చిన ప్రతి అథితికి షడ్రుచులతో భోజనం వడ్డించారు.
చిన్నారి తల్లిదండ్రులు భావోద్వేగం
కుటుంబంలో 35 ఏళ్ల తర్వాత ఆడబిడ్డ జన్మించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు ఆనందభాష్పాలు రాల్చారు. ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాం. అందుకే ఇంత పెద్దగా వేడుక నిర్వహించామన్నారు. అబ్బాయిలకు సరిసమానంగా అమ్మాయిలను చూడడం మా ఇంటి ప్రత్యేకత తండ్రి రోహిత్ అన్నారు. ఇది నా జీవితంలో అత్యంత ఆనందమైన రోజు. ప్రతి కుటుంబం ఆడబిడ్డ పుట్టినప్పుడు ఇలాగే సంతోషంగా జరుపుకోవాలి అని తల్లి భావోద్వోగానికి లోనయ్యారు.
