- ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో అరుదైన ఘటన
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
విధాత: కనిపెంచిన తల్లిదండ్రులు చనిపోతే కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కొందరు కొడుకులు, బిడ్డలు ముందుకురాని నేటి రోజుల్లో రెండు నెలల ఆహారమిచ్చిన వ్యక్తికి ఓ వానరం ఘనంగా నివాళులర్పించింది. మృతుడి కుటుంబంతోపాటు మృతదేహం పక్కనే కోతి విషణ్ణ వదనంతో కూర్చున్నది. తనకు ఆహారం ఇచ్చిన వ్యక్తి చనిపోయాడని ఏడుస్తూ కనిపించింది.
కాగా.. మృతదేహాన్ని అంత్యక్రియల స్థలానికి తరలిస్తున్నప్పుడు ఒంటరిగా వదిలివేళ్లడానికి నిరాకరించింది. వాహనంలోనే 40 కిలోమీటర్లు వెళ్లింది. దహన సంస్కరాలు పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉన్నది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఈ అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమ్రోహాకు చెందిన రామ్‌కున్వర్ సింగ్ అనే వ్యక్తి రెండు నెలలుగా ఓ కోతికి రొట్టెలు తినిపిస్తున్నాడు. కోతి, ఆయన ఇద్దరూ రోజూ ఒకరితో ఒకరు సరదాగా కొంత సమయం పడిపేవారు. మంగళవారం ఉదయం ఆ వ్యక్తి చనిపోయాడు. రోజుమాదిరిగా మంగళవారం కూడా ఆ ప్రదేశానికి కోతి రాగా, ఆయన నిర్జీవంగా కనిపించాడు. పాడే పక్కనే కోతి కన్నీళ్లు పెడుతూ కూర్చున్నది.
ఇతర బంధువులతో కలిసి సింగ్ అంత్యక్రియలకు కోతి హాజరైంది. భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం వాహనంలో తిగ్రి ఢామ్ వద్దకు తీసుకురాగా, వాహనంలోనే 40 కిలోమీటర్లు కోతి పయనించింది. ప్రయాణ సమయంలో మృతదేహంపైనే కోతి విషణ్ణ వదనంతో పడుకొని ఉన్నది. చితి దగ్గర చాలా సేపు వేచి ఉన్నది. అటూ ఇటూ తిరిగింది. తనకు ఆహారం అందించిన పట్ల కోతి తనకున్న ఆప్యాయత, విధేయతను తెలిజేసేలా ఉన్న వీడియో నెటిజన్ల మనస్సును ఆకర్షించింది.