Kerala Landslides : కేరళ (Kerala) లోని వాయనాడ్ (Wayanad) జిల్లాలో మృత్యు ఘోష వినిపిస్తోంది. ఎడతెరపిలేని వర్షాల కారణంగా మంగళవారం తెల్లవారుజామున వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి (Meppadi) సమీపంలోని పలుచోట్ల భారీ ఎత్తున కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. దాంతో పదుల సంఖ్యలో జనం కొండ చరియల కింద చిక్కుకుపోయారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (KSDMA), అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు (NDRF) ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తొలి గంటలోనే 7 మృతదేహాలను వెలికి తీశారు. 20 మందికిపైగా క్షతగాత్రులను వెలికి తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఆ తర్వాత కూడా కొండచరియలను తొలగించినా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి.
దాంతో ఉదయం 10 గంటల వరకు మొత్తం 70 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల ఇంకా చాలా మంది ఉన్నట్లు స్థానికులు చెబుతన్నారని, దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. ఘటనా ప్రాంతంలో వర్షం పడుతున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమీప ప్రాంతాల నుంచి అదనపు రిలీఫ్ బృందాలను కూడా వయనాడ్‌కు రప్పించారు. భారీగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు.